సుకుమార్ కుమార్తె సుకృతి తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన సినిమా ‘గాంధీ తాత చెట్టు’. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. సుకుమార్ భార్య తబిత ఈ చిత్రానికి సమర్పకురాలు. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. ఈనెల 24న విడుదల అవుతోంది. ట్రైలర్ ఈరోజు మహేష్‌బాబు చేతుల మీదుగా విడుదలైంది.
ట్రైలర్ చాలా భావోద్వేగంగా సాగింది. గాంధీ అనే పేరున్న ఓ అమ్మాయి ప్రయాణం ఇది. గాంధీ అనే పేరు ఓ అమ్మాయికి పెట్టడం ఏమిటి? అన్నది ప్రశ్న. దానికి ఈ ట్రైలర్లోనే అందమైన జవాబు చెప్పారు. గాంధీ పేరు పెట్టుకొన్న అమ్మాయి నిజంగానే గాంధేయవాదిగా ప్రవర్తించడం మొదలెడుతుంది. అబద్ధం ఆడదు. చిన్న అపకారం కూడా చేయదు. అలాంటి అమ్మాయి తన తాతకు మాటిస్తుంది. ఓ చెట్టు కాపాడతానని. ఆ తరవాత ఏమైందన్నదే కథ. ఓ చెట్టుని కాపాడడం కోసం ఓ అమ్మాయి ఏం చేసిందన్నది ఆసక్తిరంగా మలిచారు. సుకృతి నటన, ఆమె ఎక్స్ప్రెషన్స్ చాలా సహజంగా అనిపించాయి. నేపథ్య సంగీతం, కెమెరాపనితం అన్నీ కూల్ గా ఉన్నాయి. క్లైమాక్స్ లో గాంధీ అవతారంలో సుకృతి కనిపించడం, రఘపతి రాఘవ రాజారాం… అంటూ భావోద్వేగంగా పలికించడం ఇవన్నీ ఆకట్టుకొన్నాయి. ఓ బలమైన ఎమోషన్ తో ఈ సినిమాని తీర్చిదిద్దారని, క్లైమాక్స్ ఆలోచనల్లో పడేస్తుందని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా మలిచినా, మైత్రీ మూవీస్ అండతో థియేటర్లలో విడుదల చేస్తున్నారు.