వినాయకచవితి వేడుకలను కరోనా కారణంగా రెండేళ్ల పాటు నిర్వహించలేదు. ఎవరికి వారు ఇళ్లలోనే చేసుకున్నారు. వీధుల్లో మండపాలు లేవు. దీని వల్ల భారత్ లక్షల కోట్లు నష్టపోయిందని కొన్ని అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్లు అంచనా వేశాయి. అందులో డౌటే లేదు. వినాయక నవరాత్రులు వస్తే.. ఉరూవాడా సందడి ఉంటుంది. ఎంతగా ఉంటే… లక్షలు ఖర్చు పెడుతూంటారు. ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. ఎన్నో వ్యాపారాలు బిజీగా మారుతాయి. కరోనా తరవాత ఈ ఊపు, ఉత్సాహం అంతకంతకూ పెరుగుతోంది.
వినాయక చవితి వస్తే ఒకప్పుడు హైదరాబాద్లోనే ఎక్కువగా గణేష్ మండపాలు కనిపించేవి. కానీ ఇప్పుడు గ్రామాల్లోనూ భారీ వినాయకులు సాక్షత్కరిస్తున్నారు. నవరాత్రుల పాటు వేడుకలు నిర్వహించి నిమజ్జనం చేస్తున్నారు. అంటే.. ఇప్పుడు గల్లీల నుంచి గ్రామాలకు పాకిపోయింది. మండపం పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ఎలా లేదన్నా… తొమ్మిది రోజుల్లో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మండపం వేయడం దగ్గర నుంచి విగ్రహం, పూజలు, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, నిమజ్జం వరకూ.. సాదాసీదాగా చేసినా ఐదారు లక్షల రూపాయల ఖర్చు వస్తుంది. ఇక లైటింగ్ కాస్త బెటర్ గా ఉండాలనుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. ఓ రకంగా ఇదంతా ప్రొడక్టవిటీ. దీని వల్ల సంపద పెరుగుతుంది.
సగటున ఒక్కో మండపం ఖర్చు రూ. ఐదు లక్షలు అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనీసం లక్ష మండపాలు ఉంటాయని అంచనా. లక్ష విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు అంటే.. లక్షమండపాల్లో ఒక్కో చోట ఐదు లక్షల వరకూ ఖర్చు పెట్టి ఉంటారంటే.. ఎంత ఉపాధి, ఎంత వ్యాపారం జరిగి ఉండాలి ?. ఇదే ఉత్సాహం రెండు, తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది.
వినాయక చవితి ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే..అందరూ తలా ఓ చేయి వేసుకుని నిర్వహించడం. ఏ ఒక్కరూ పూర్తిగా భరించరు. అది ఖర్చుగా ఎవరూ భావించరు. అక్కడే గణనాధుడు.. ఆర్థికాభివృద్ధి అందరి మీద ఆధారపడి ఉంటుందని నిరూపించి కలసికట్టుగా ముందుకు సాగేలా చేస్తున్నాడనుకోవచ్చు.