వినాయకచవితి వేడుకలకు తెలంగాణలో ఈ ఏడాది ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నిమజ్జానికి మాత్రం చాలా ఇబ్బందులు వస్తున్నాయి. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆప్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎకో గణేష్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు… చేశారు కానీ ఇళ్లలో పెట్టుకునేందుకు మాత్రమే ఎకో గణేష్‌ను ప్రోత్సహిస్తున్నారు. కాలనీల్లో పెట్టుకునే విగ్రహాల్లో 95 శాతం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో రూపొందించేవే. వాటిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దంటే ఇక అక్కడ నిమజ్జనం నిషేధించినట్లే. మరి ఆ విగ్రహాలన్నింటినీ ఎక్కడ నిమజ్జనం చేయాలి. అన్నింటి కంటే ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడ్ని ఎక్కడ నిమజ్జనం చేయాలి..? .
ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కలవర పరుస్తోంది. హైదరాబాద్ నుంచి మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఇది మరింత టెన్షన్ తీసుకొచ్చింది. హైకోర్టు పెద్ద మనుసు చేసుకోవాలని ఓ సారి .. ఆరు నూరైనా నిమజ్జనం సాగర్‌లోనే చేస్తామని మరోసారి ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం తరపున హౌస్ మోషన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సారికి టైం లేదని .. వచ్చే ఏడాదికి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి పర్మిషన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కోర్టు ఎలా స్పందిస్తుందన్నదానిపై ప్రభుత్వానికి నిమజ్జన కష్టాలు తీరుతాయా… పెరుగుతాయా అన్నది తేలాల్సి ఉంది. హుస్సేన్ సాగర్‌తో పాటు వివిధ చెరువుల్లో వినాయక నిమజ్జనంపై ఎప్పటి నుండో భిన్నవాదనలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా గతంలో నిమజ్జన కుంటలు నిర్మిస్తామని ప్రచారం చేసుకుంది. కానీ ఏదీ జరగలేదు. ఈ వివాదం ప్రతీ ఏటా వస్తూనే ఉంది. కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది.