హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఐడీ పోలీసులు తమ తమ రాష్ట్రాలలోని ప్రత్యేక కేసులపై దృష్టి కేంద్రీకరించారు. ఏపీ సీఐడీ పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిపైన, తెలంగాణ సీఐడీ పోలీసులు ఏఎస్ఐ మోహన్ రెడ్డిపైన ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు చేస్తున్నారు. గంగిరెడ్డిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు ఇవాళ మారిషస్‌నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. ముంబాయి అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను ఇంటర్ పోల్ సహకారంతో కొద్ది రోజులక్రితం ఇండోనేషియాలోని బాలి నుంచి భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఛోటా రాజన్ అరెస్ట్ వ్యవహారం గంగిరెడ్డి అరెస్టుకు ఉపయోగపడిందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఛోటా రాజన్ అరెస్ట్‌ను చూపించటంద్వారా మారిషస్ పోలీసులను ఏపీ సీఐడీ ఉన్నతాధికారులు గంగిరెడ్డిని అప్పగించేందుకు ఒప్పించగలిగారని సమాచారం. పైగా ఛోటా రాజన్‌పై ఇంతవరకు ఒక్క కేసుకూడా నిరూపించబడకపోగా, గంగిరెడ్డిపై కొన్ని కేసులలో నేరం నిరూపించబడి శిక్ష పడిఉండటంతో ఏపీ పోలీసుల పని తేలికయ్యింది. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసులో నిందితుడని చెప్పటంకూడా ఉపయోగపడింది.
ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఢిల్లీనుంచి ఏపీ సీఐడీ అధికారులు గంగిరెడ్డిని తీసుకుని శంషాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంనుంచి అతనిని వీఐపీ మార్గంద్వారా మీడియా కళ్ళుగప్పి సీఐడీ ఆఫీసుకు తరలించారు. మధ్యాహ్నం అతనిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముందని చెబుతున్నారు. మరోవైపు గంగిరెడ్డి అరెస్టుతో వివిధ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నాయకులకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని అంటున్నారు. వీరికి గంగిరెడ్డితో అనేక సంబంధాలు, లావాదేవీలు ఉన్నాయట. అతనిపై మొత్తం 28 కేసులు నమోదై ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 2004లో అలిపిరిలో జరిగిన హత్యాయత్నం కేసులో కూడా ఇతను నిందితుడు.
మరోవైపు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న కరీంనగర్ ఏఎస్ఐ మోహన్‌రెడ్డి వడ్డీ దందాకేసుపై సీఐడీ పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసులో తవ్వేకొద్దీ కొత్త వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మోహన్‌రెడ్డికి సహకరించిన ఇద్దరు డీఎస్పీలు, ఒక ఏఎస్పీపై వేటుపడింది. మరికొంతమంది పోలీసులపై ఓటు పడే అవకాశముందని చెబుతున్నారు. మోహన్ రెడ్డి బినామీలను పట్టుకునేందుకు 6 బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐడీ డీజీ రవివర్మ చెప్పారు. స్కూల్ కరెస్పాండెంట్ ప్రసాదరావు ఆత్మహత్యతో మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మోహన్ రెడ్డి ఇటీవల రిలీజైన బ్రూస్లీ చిత్రానికి కూడా రు.40 లక్షలు ఫైనాన్స్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.