హైదరాబాద్: ఎట్టకేలకు ఏపీ పోలీసుల చేతికి చిక్కిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని పోలీసులు మీడియాతో మాట్లాడనీయలేదు. అయితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ విలేకరి మాత్రం ఎలాగోలా అతనికి దగ్గరగా వెళ్ళగలిగాడు. అతనిని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేశాడు. కానీ గంగిరెడ్డి మాత్రం వేదంత ధోరణిలో ముక్తసరిగా ఒకటి రెండు మాటలు మాత్రమే మాట్లాడాడు. ఇప్పటి వరకు ఎక్కడున్నారు, ఏం చేశారు అని విలేకరి అడగగా, సార్(పోలీస్ ఉన్నతాధికారులు) చెప్తారు, నాదేముంది, నాకేమీ లేదు చెప్పటానికి అన్నాడు. ఇన్ని రోజులూ ఎక్కడున్నారని అడగగా, తనకే తెలియదని చెప్పాడు. ఇన్నిరోజులూ ఈ స్మగ్లింగ్ చేయటానికి ఎవరు సహకరించారని అడగగా, ఆ దేవుడే సహకరించాడేమోనని అన్నాడు. తనను వదిలేయాలంటూ విలేకరికి దండం పెట్టాడు. విలేకరి మరికొన్ని ప్రశ్నలు వేయబోగా, తాను ఇంటర్వ్యూ ఇచ్చేటంత పెద్ద వాడిని కాదని, తనను వదిలేయాలని చెప్పాడు. తన టైమ్ బాగోలేక ఇలా అయిపోయిందని అన్నాడు. తనను వదిలేయాలని, తానేమీ చెప్పలేనని బదులిచ్చాడు. తర్వాత మీడియాముందు ప్రవేశపెట్టగా, తాను మినరల్ బిజినెస్ చేయటానికి మారిషస్ వెళ్ళానని చెప్పాడు. తనకు పెళ్ళయిందని, ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారని తెలిపాడు. తెలుగుదేశం ప్రభుత్వంనుంచి తనకు ఎటువంటి ప్రాణహాని లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. రు.400 కోట్ల ఆస్తులున్నాయని పోలీసులు చెబుతున్నారని అడగగా, తనకవన్నీ తెలియదని అమాయకంగా చెప్పాడు.
మరోవైపు గంగిరెడ్డిని మీడియాముందు ప్రవేశపెట్టేముందు డీజీపీ రాముడు మీడియాతో మాట్లాడారు. అతనికి రు.300-400 కోట్ల ఆస్తులు ఉండొచ్చని చెప్పారు. ముందు అతనిని పొద్దుటూరు కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. మొరాకో నుంచి మారిషస్ వెళుతుండగా పట్టుబడ్డాడని చెప్పారు. ఈ మధ్య కాలంలో సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి చాలా దేశాలు తిరిగాడని తెలిపారు. అతను పెద్ద పెద్ద లాయర్లను నియమించుకుంటుండటంతో ఇక్కడకు రప్పించే విషయంలో న్యాయపరంగా జాప్యం జరిగిందని చెప్పారు.