అతని పేరు పెన్సిల్ పార్థసారధి. హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలు చూస్తూ.. వాటిని కాపీ కొట్టి నవలలుగా రాసేశాడు. అలాంటి పుస్తకాలు 28 పేరుకుపోయి ఉన్నాయి. ఆ నవలలు చదివి అయిదుగురు ఆడవాళ్లు.. తనకి అభిమానులైపోయాయి. ఉత్త ఫ్యాన్స్ కాదు, రివైంజ్ ఫ్యాన్స్. థ్రిల్లర్ నవలలు రాసేవాళ్లకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయని నమ్మి.. తన పగ తీర్చుకోవడానికి పెన్సిల్ పార్థసారధిని పావుగా వాడుకున్నారు. మరి…. వాళ్ల పగేంటి? ఆ కథేంటి? అనేది తెలియాలంటే ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చూడాల్సిందే.
నాని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. సెప్టెంబరు 13న విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ బయటకు వచ్చింది. కథని క్లుప్తంగా ట్రైలర్లోనే చెప్పేశాడు దర్శకుడు. నాని కామెడీ టైమింగ్ తో మరోసారి కావల్సినంత ఫన్ పండబోతోందని అర్థమైంది. రివైంజ్డ్రామా కాబట్టి యాక్షన్కీ బోలెడంత స్కోప్ ఉంది. విలన్గా యువ హీరో కార్తికేయని ఎంచుకుని మంచి పని చేశారు. ఓ కొత్త విలన్ని తెరపై చూసే అవకాశం దక్కింది. `సమర శంఖం నేను ఊదుతా.. యుద్ధం మీరు మొదలెట్టండి` అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. అంటే నానిది మహాభారతంలో కృష్ణుడు తరహా పాత్రన్నమాట. తను ఓ యుద్ధానికి సారధిగా ఉంటాడంతే. మరి ఆ యుద్ధం ఎందుకు? ఎవరిపై అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ‘ఎక్స్పెక్ట్ అన్ ఎక్స్పెక్టెడ్’ అనేది ట్యాగ్ లైన్. విక్రమ్ గత సినిమాల్లాగానే ఇందులోనూ ఊహించని మలుపులు ఉండబోతున్నాయన్నమాట. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అనిరుథ్ నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునే స్థాయిలో ఉంది. ఈ గ్యాంగ్ నీ, ఆ లీడర్నీ చూస్తుంటే… గ్యాంగ్ లీడర్ ప్రాజెక్టు వర్కవుట్ అయ్యేట్టే కనిపిస్తోంది.