హుజూరాబాద్ ఉపఎన్నికల బాధ్యత తీసుకుని ఎంత ఖర్చు అయినా సరే ఈటలను ఓడించాలని పట్టుదలగా ఉన్న మంత్రి గంగుల కమలాకర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. ఆయన గ్రానైట్ కంపెనీలపై గురి పెట్టింది. గంగుల చాలా కాలంగా గ్రానైట్ బిజినెస్‌లో ఉన్నారు. ఆయనకు శ్వేతా ఎంటర్ ప్రైజెస్ అనే కంపెనీ ఉంది. దీంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారంపై ఆయనకు పట్టు ఉంది. గ్రానైట్ వ్యాపారులు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని.. ఎగుమతులు చేస్తూ కూడా లెక్కలు చెప్పడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా పేమా కింద ఈడీ విచారణ ప్రారంభించింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున గ్రానైట్ మైనింగ్ నడుస్తోం ది. వీటిని శ్వేత ఏజెన్సీస్, శ్వేత గ్రానైట్స్ తో పాటు మరికొన్ని కంపెనీలు నిర్వహిస్తున్నాయి. ఇవి ఏళ్ల తరబడి నిబంధనలు ఉల్లంఘిస్తూ పన్నులు .. రాయల్టీ ఎగ్గొడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే విజిలెన్స్ దాడులు జరిగాయి. నిర్దేశించిన పరిమాణాన్ని మించి ఉన్న గ్రానై ట్ బ్లాక్‌లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు అధి కారులు గుర్తించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి ఏ సంస్థ వల్ల ఎంత నష్టం జరిగిందో లెక్కించారు. 2013లోనే ఆయా కంపెనీలకు రూ. 750 కోట్ల వరకూ జరిమానా విధించారు. అయితే తర్వాత రూ. రూ.11 కోట్ల వరకు మాత్రమే చెల్లించారు. దీన్నే ఈడీకి ప్రధానంగా ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం ఈడీ ఇతర విషయాలపైనా విచారణ చేపట్టింది. కరీంనగర్ నుంచి కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఎంతమేర గ్రానైట్ విదేశాలకు తరలించారనే అంశంపై ఆరా తీస్తోంది. ప్రధానంగా ఈ వ్యవహారం గంగుల కమలాకర్‌ను నిలువరించేందుకేనని భావిస్తున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్ ఉపఎన్నిక బాధ్యతలు ఆయనే చూస్తున్నారు. ఉపఎన్నిక ఖర్చంతా ఆయనే పెట్టుకుంటున్నారన్న ప్రచారం ఉంది . ఈ తరుణంలో ఈడీ దాడులు.. టీఆర్ఎస్లోనూ అలజడి రేపుతున్నాయి.