గంజాయిని సాగు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడో ఊరికి దూరంగా చేలల్లో, అదీ మిర్చి పంట మధ్యలో సాగు చేస్తారు. గంజాయి ఘాటు తెలియకుండా. కానీ ఇప్పుడు ఓ ప్రబుద్ధుడు తెలివిమీరి పోయాడు. ఏకంగా హైదరాబాద్ లోని ఓ అపార్టమెంటులోనే గంజాయి సాగు మొదలుపెట్టాడు.
గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వై కె రెసిడెన్సీ అనే భవనంలో ఓ వ్యక్తి పెద్ద గంజాయి పండించడం మొదలుపెట్టాడు. పూలకుండీల్లో గంజాయి మొక్కలను చాలా జాగ్రత్తగా పెంచుతున్నాడు. గంజాయి ఘాటు చుట్టు పక్కల వాళ్లకు తెలియకుండా స్ప్రేలు వాడుతున్నాడు. ఎయిర్ కండిషనర్ , స్పెషల్ లైటింగ్ వగైరా హంగులు కూడా సమకూర్చారు.
సూదిని మూటగడితే దాడుతుందా? ఎంత స్ప్రే చల్లినా గంజాయి ఘాటు గుప్పుమనకుండా ఉంటుందా? ఎవరో పోలీసులకు ఉప్పందించారు. అంతే, పోలీసులు హటాత్తుగా దాడి చేశారు. పూలకుండీల్లోని గంజాయి మొక్కలను చూసి బిత్తర పోయారు. అదో గంజాయి వనంలా సీన్ కనిపించే సరికి ఆ ప్రబుద్ధుడి క్రియేటివిటీకి ఆశ్చర్యపోయారు. చివరకు గంజాయి సాగుదారును అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. ఇంత కాలం గంజాయి సాగు చేస్తున్నా ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేయడం గొప్ప విషయమే అంటున్నారు ఆ ప్రాంత వాసులు. అయినా ఈ విషయం కనిపెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది ఎవరో గానీ మంచి పనిచేశాడని మెచ్చుకుంటున్నారు.
అడవిలో పెంచే గంజాయి జనారణ్యంలోనే సాగు కావడం కొత్త పోకడ. ఈ లెక్కన భాగ్యనగరంలో ఇంకెన్ని జరగకూడని పనులు జరుగుతున్నాయో మరి.