రచ్చతో మాస్ డైరెక్టర్ అనిపించుకొన్నాడు సంపత్‌నంది. ఆ తరవాత మాస్, కమర్షియల్ సినిమాలు చేసుకొంటూ ఒక్కో మెట్టూ ఎదుగుతున్నాడు. ఆమధ్య సాయిధరమ్ తేజ్‌తో `గాంజా శంకర్` అనే సినిమా ప్రకటించారు. అయితే బడ్జెట్ కారణాల వల్ల ఈ సినిమా ముందుకు కదల్లేదు. ఆ తరవాత తేజ్.. మరో సినిమా మొదలెట్టేశాడు. ఇప్పుడు సంపత్ నంది ఖాళీ. తనకో హీరో కావాలి. అందుకే… శర్వానంద్ కోసం ఓ కథ రెడీ చేసినట్టు తెలుస్తోంది. శర్వా కూడా ఈ కథకు ఓకే చెప్పాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. తేజ్‌తో తీయబోతున్న ‘గాంజా శంకర్’నే శర్వాతో తెరకెక్కిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే అది నిజం కాదు. శర్వా కోసం కొత్త కథ రాస్తున్నాడు సంపత్‌నంది. ప్రస్తుతం ఈ కథపైనే సంపత్‌నంది కసరత్తు చేస్తున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓ స్పోర్ట్స్ డ్రామా కూడా ఇటీవలే పట్టాలెక్కింది. ఇవి రెండూ సమాంతరంగా షూటింగ్ జరుపుకొంటున్నాయి.
‘గాంజా శంకర్’ కథని సంపత్ నంది ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టే. తన దృష్టంతా శర్వా కథపై ఉంది. ఒకవేళ శర్వా సినిమా లేట్ అవుతుందనుకొంటే, ‘గాంజా శంకర్’ కథకు మరో హీరో దొరికితే.. అప్పుడు ముందుగా ‘గాంజా శంకర్’ మొదలవుతుంది. ఆ తరవాత శర్వా సినిమా ఉంటుంది. కాస్త అటూ ఇటూ అయినా శర్వా సినిమా పట్టాలెక్కడం మాత్రం ఖాయం. ప్రస్తుతం సంపత్‌నంది నిర్మాణంలో ‘ఓదెల 2’ తయారవుతోంది. తమన్నా ఇందులో ప్రధాన పాత్రధారి.