ఆంధ్రప్రదేశ్లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి పార్లమెంట్ కు తెలిపారు. మొత్తం పది రాష్ట్రాల నుంచి 22 పేరు మార్పు ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.
విజయవాడ ఎయిర్ పోర్టును ఇప్పటికీ గన్నవరం ఎయిర్ పోర్టుగానే పరిగణిస్తున్నారు. అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.చాలా రోజుల నుంచి ఈ డిమాండ్ ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. గతంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు ఉండేది. కానీ తర్వాత వైఎస్ హయాంలో రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే.. ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా విజయవాడ విమానాశ్రయం మారనుంది.
Also Read : విజయవాడ- హైదరాబాద్ మధ్య హైవే 6 లైన్లకు పెంపు !
ఇక కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ప్రజల డిమాండ్ లకు అనుగుణంగా ఈ పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వం సిఫారసు చేసింది. అలాగే తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును రేణిగుంట ఎయిర్ పోర్టుగా పిలుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఎయిర్ పోర్టుగా మార్చాలన్న ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం పెట్టింది. కేంద్రం ఆమోదించిన తర్వాత పేర్లు మారే అవకాశాలు ఉన్నాయి.