గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. బుధవారం నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని అంగీకరించింది. ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం నవ్యాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు తప్పని సరైంది. ఇప్పటికే గన్నవరంలో ఉన్న విమానాశ్రయాన్ని అవసరాల మేరకు విస్తరించారు. ఇప్పుడు కేంద్రం అనుమతి రావడంతో విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా లభించనుంది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గన్నవరం విమానాశ్రయం సైనిక స్థావరంగా ఉపయోగపడింది. 2003 నుంచి ఎయిర్ డెక్కన్ సంస్థ విజయవాడ-హైదరాబాద్ నడుమ రోజువారీ విమానాలను నడపడం ప్రారంభించింది. 537 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విమానాశ్రయంలో ప్రస్తుతం 2286మీటర్ల రన్‌వే ఉంది. 14 నెలల్లో 135 కోట్ల రూపాయలను ఖర్చు చేసి, కొత్త టెర్మినల్‌ను నిర్మించారు. 2017 జనవరి 12న ప్రారంభమైంది. ఇప్పుడు అంతర్జాతీయ టెర్మినల్‌ను నిర్మించాల్సుంది. నవ్యాంధ్రకు అత్యంత ప్రతిష్టాత్మకంగానూ, రాజధానికి మకుటంగానూ భాసిల్లే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీరామారావు పేరు పెడతారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.