ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండు సార్లు గెలిచారు. ఆయన వైసీపీలోకి పోవడంతో టీడీపీకి నాయకత్వం లేదనుకున్నారు. కానీ వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు చేరడంతో సీన్ మారిపోయింది. ఇప్పుడు వంశీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. వివిధ కారణాలతో వంశీ దూకుడు తగ్గించారు. ఓ దశలో ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న సందేహం ఏర్పడింది. చివరికి ఆయనే బరిలోకి దిగారు. ఇప్పుడు యార్లగడ్డ వర్సెస్ వంశీ హోరాహోరీ సాగుతోంది.
గన్నవరంలో ప్రత్యర్థులు వారే. కానీ పార్టీలే వేరు. వల్లభనేని వంశీకి వైసీపీలో పలు వర్గాలు వ్యతిరేకంగా ఉంటే… టీడీపీలో మాత్రం యార్లగడ్డ వెంకట్రావు వెనుక క్యాడర్ అంతా నిలిచారు. సామాజికవర్గ పరంగా టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది. టీడీపీ ఓడిపోయిన తర్వాత వంశీ అనేక సవాళ్లు ఎదురవుతాయని తెలిసినా వైసీపీలో చేరిపోయారు. పార్టీలో తరచుగా విభేదాలు, వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు.. వంశీకి సహకరించడం లేదు. ఇక్కడ బలంగా ఉన్న కమ్మ సామాజికవర్గం ఓటర్లు.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబు అండతో రాజకీయాల్లోకి వచ్చి ఆయన కుటుంబాన్ని దూషించడం మైనస్‌గా మారింది. సామాజికవర్గం మొత్తం వెలి వేసినట్లుగా వ్యవహరించడంతో తర్వాత ఆయన మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలోనే.. కమ్మ సామాజికవర్గమంతా.. దాదాపుగా వంశీకి వ్యతిరేకంగానే పనిచేస్తోంది.
గన్నవరం పరిధిలో నాలుగు మండలాలున్నాయి. అవి.. ఉంగుటూరు, గన్నవరం, బాపులపాడు. వీటితో పాటు విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలు.. గన్నవరం నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి. అన్ని చోట్లా యార్లగడ్డ వెంకట్రావు అనుచరగణాన్ని పెంచుకున్నారు. టీడీపీ నేతలందర్నీ కలుపుకుని వెళ్తున్నారు. యార్లగడ్డ వెంకట్రావు సహజంగా దూకుడుగా ఉండే నేత. గత ఎన్నికల్లో మూడు వేల ఓట్ల స్వల్ప తేడాతోనే పరాజయం పాలయ్యారు. సామాజికవర్గ పరంగా వైసీపీకి దూరంగా ఉండే ప్రాంతంలోనూ ఆయన గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన టీడీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. పార్టీలో చేరినప్పటి నుండి వంశీ టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నారు. దీంతో వంశీని వ్యతిరేకించే వారంతా.. యార్లగడ్డ వెంట చేరిపోయారు. వంశీకి వైసీపీలోనే మద్దతు లేదు. టీడీపీలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వేధించారని.. వైసీపీలో చేరిన తర్వాత కూడా తన అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. వారంతా వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డకు మద్దతుగా పని చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
1955లో గన్నవరం నియోజకవర్గం ఏర్పడింది. పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం లాంటి దిగ్గజాలు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య.. 3 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత.. కాంగ్రెస్ అభ్యర్థులు 4 సార్లు గెలిచారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత.. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలకు చెక్ పెడుతూ.. టీడీపీ హవా కొనసాగింది. గన్నవరం అంటే.. పసుపు పార్టీకి కంచుకోట అనే ముద్ర పడిపోయింది. 1989లో చివరిసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత రెండు సార్లు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 2009 నుంచి గన్నవరంలో వరుసగా 3 సార్లు విజయం సాధించింది టీడీపీ.
వంశీ చేసిన రాజకీయం కారణంగా ఆయనకు ఈ ఎన్నికలు డూ ఆర్ డై గా మారాయి. చాలా మంది పార్టీలు మారి ఉంటారు కానీ.. ఆయనలా బిహేవ్ చేసిన నేత లేరు. ఎవర్నీ వదిలి పెట్టేది లేదని లోకేష్ చేసే హెచ్చరికలు ప్రధానంగా వంశీ నుంచే ప్రారంభమవుతాయని టీడీపీ నేతలు చెబుతూంటారు. అందుకే వంశీకి ఈ ఎన్నికలు డూ ఆర్ డైగా చెప్పుకోవచ్చు.