గన్నవరం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీల మధ్య మాట యుద్ధం ఏ స్థాయి చేరిందో తెలిసిందే. ఆయనకి సన్మానం చేస్తానంటూ వంశీ చెప్పడం, ఇంటికెళ్లే ప్రయత్నం చేయడం, ఆ తరువాత వెంకట్రావు సీపీని కలవడం… ఇలా ఒక ఎపిసోడ్ నడించింది. అయితే, ఇదే అంశమై తాజాగా ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వల్లభనేని వంశీ మళ్లీ మాట్లాడారు. నామినేషన్ల ముందురోజే యార్లగడ్డకీ, దాసరి బాలవర్థన్ కు తాను ఫోన్ చేశాననీ, బెస్టాఫ్ లక్ లు చెప్పుకున్నామన్నారు. గతంలో తాను లగడపాటి రాజగోపాల్, దుట్టా రామచంద్రరావుల మీద ఎన్నికల్లో పోటీ చేశాననీ… అయితే, తమ మధ్య ఎన్నికల ప్రచారం కేవలం పార్టీ విధానాలకు మాత్రమే పరిమితమౌతూ వచ్చిందన్నారు. ఎవరు గెలిస్తే ఏం చేస్తామని మాత్రమే మాట్లాడుకునేవారమన్నారు.
కానీ, తాజా ఎన్నికల ప్రచారంలో వెంకట్రావు, బాలవర్థన్ ఒక పరిధి దాటి మాట్లాడారని వంశీ ఆరోపించారు. తన వ్యక్తిగత అంశాల వరకూ దుష్ప్రచారం చేస్తున్నా… ఎన్నికల ప్రచారంలో తాను పెద్దగా స్పందించలేదన్నారు. ఎన్నికలు అయిపోయాక ఒక విషయాన్ని వెంకట్రావుకి స్పష్టత ఇద్దామనుకున్నాననీ… మన మధ్య తగాదాలేవీ లేవనీ, కేవలం ఎన్నికల వల్ల శత్రుత్వాలు పెంచుకోకూడదన్న ఉద్దేశంతో తాను ఫోన్ చేశానన్నారు. ఆయన ఇంటికి వెళ్లి ఒక దండ వేసి సన్మానం చేద్దామనుకున్నా అన్నారు! సన్మానం ఎందుకూ అంటే.. గన్నవరాన్ని డల్లాస్ చేస్తానన్నానీ, ఆ ప్రపోజల్ నచ్చింది కాబట్టే సత్కరించాలని అనుకున్నానని వంశీ అన్నారు. కానీ, వెంకట్రావ్ తనకు దొరకలేదనీ, ఆయన ఇంటికి తాను వెళ్తే భయం అనుకుంటే… తన ఇంటికే ఆయన అనుచరులతో రమ్మనండి అంటూ వంశీ అన్నారు. ఇప్పటికీ ఆ సన్మానం ఆలోచన విరమించుకోలేదనీ… శాలువా దండా రెడీగా ఉన్నాయన్నారు వంశీ! వారితోపాటు, ఈతరం బిడ్డల భవిష్యత్తు కోసం వైసీపీకి ఓటెయ్యాలని చెప్పిన గొప్ప నాయకులందరికీ సన్మానాలు చేద్దామని అనుకున్నానని ఆయన చెప్పారు.
గన్నవరంలో తన గెలుపు ఖాయమన్నారు. ఎక్కడి నుంచో వచ్చినవారు చెబితే వినే పరిస్థితుల్లో గన్నవరం ప్రజలు లేరన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద రాష్ట్రవ్యాప్తంగా అపారమైన నమ్మకం ఉందన్నారు. గన్నవరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తు సీట్లను టీడీపీ గెలుస్తుందనీ, మరోసారి ప్రభుత్వ ఏర్పాటు చేయబోతున్నామని వంశీ ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి, ఈ సన్మానం పేరుతో మొదలైన ఉద్రిక్తత ఇంకొన్నాళ్లు కొనసాగేట్టుగానే ఉంది. ఆ విషయంలో తాను తగ్గేది లేదని వంశీ ఇప్పటికీ చెబుతున్నారు. ఈ వైఖరి ఎక్కడికి దారితీస్తుందో మరి..?