” ప్రభుత్వానికేం సంబంధం లేదు.. అధికారులు నివేదిక ఇచ్చారు.. అమ్మేశాం..!” ఇది గంగవరం పోర్టు విషయంలో భారీ స్కాం జరిగిందని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణంలో ప్రభుత్వం తరపు లాయర్ వాదన. ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గంగవరం పోర్టులో వాటాల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయించిందని కోర్టుకు తెలిపారు. అంటే ఈ అమ్మకంలో స్కాం ఏదైనా ఉంటే అధికారులే చేసి .. తప్పుడు నివేదిక సమర్పించారని ప్రభుత్వం కోర్టుకు తెలిపిందన్నమాట.
గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.40 శాతం వాటా ఉంది. దాన్ని ఆదాని పోర్టుకు కారణాలు లేకుండానే అమ్మేశారు. పోర్టుల అమ్మకం విషయంలో లోపాలపై లోకాయుక్తతో దర్యాప్తు జరిపించాలని, కాగ్‌తో దర్యాప్తు చేయించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బయటకు ఏమీ తెలియకుండా రహస్యంగా వాటా విక్రయించారని ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికను కూడా బయటపెట్టలేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికితీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం వాటా విక్రయించినట్లుగా అదానీ పోర్టు సెబీకి తెలిపిన తర్వాతే విషయం బయటకు తెలిసిందన్నారు. ఆమోదానికి సంబంధించిన లేఖలు, జీవోలు ప్రజలకు అందుబాటులో లేవని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రూ.9 వేల కోట్ల విలువైన ప్రభుత్వ వాటాను అదానీ సంస్థ కేవలం రూ.645 కోట్లుకు దక్కించుకుందని.. విక్రయ ప్రక్రియకు సంబంధించి గతంలో జారీ చేసిన మూడు జీవోల అమలుపై స్టే ఇవ్వాలని కోరారు.పోర్టుల్లో ప్రభుత్వ వాటా అదానీ సంస్థకు విక్రయ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల పాత్రపై లోకాయుక్తతో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల విషయంలో సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఒప్పందాలు, జీవోల నోట్‌ఫైళ్లను పరిశీలించాలని కోరారు. పూర్తి వివరాలు సమర్పిస్తామని వాయిదా కావాలని ప్రభుత్వం కోరడంతో ఇరవయ్యో తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.