విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్‌తో.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెరపైకి వచ్చారు. రాజధాని విషయంలో ఇంత రగడ జరుగుతున్నప్పటికీ… సీనియర్ నేతగా.. గంటా శ్రీనివాసరావు ఇంత వరకూ స్పందించలేదు. పార్టీ వేదికపై కూడా.. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాంటిది హఠాత్తుగా.. మీడియా ముందుకు వచ్చి… విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధానిపై జగన్ మౌనం.. ప్రమాదకరమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయి ఆరేళ్లయినా రాజధానిపై చర్చ జరగడం బాధాకరమని.. రాష్ట్రానికి దశదిశ నిర్ణయించేది రాజధానినేనన్నారు. టీడీపీ ఓడిపోయినప్పటి నుండి ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. అసెంబ్లీలో సమావేశాల్లో గంటా ఎక్కడా.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వైసీపీపై విమర్శలు చేయలేదు. ఆ తర్వాత కూడా సైలెంట్ గానే ఉన్నారు.
పార్టీ మార్పు వార్తలు ఉద్ధృతంగా వచ్చిన సమయంలో మాత్రం.. ఒకసారి క్లారిటీ ఇచ్చారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని.. పదే పదే వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఆయినప్పటికీ.. ఆయన అంటీముట్టనట్లుగా ఉండటంతో… ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది. తాజాగా… విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్ తో తెరపైకి వచ్చారు. దేశంలో ప్రత్యేకంగా ఆర్థిక రాజధాని, వాణిజ్య రాజధాని అంటూ అధికారికంగా ఏ నగరానికీ హోదా లేదు. కేంద్రంలో అయినా.. రాష్ట్రంలో అయినా. దేశానికి ఆర్థికంగా…. పిల్లర్ లా ఉంటుంది కాబట్టి.. ముంబైని ఆర్థిక రాజధానిగా పేర్కొంటారు.
వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువగా జరిగితే వాణిజ్య రాజధాని అని నిక్‌నేమ్ పెట్టి పిలుస్తారు. అంతే కానీ… ప్రత్యేకంగా హోదా ఏమీ రాదు. ఆ మాటకు వస్తే.. విశాఖకు… ఇప్పటికే.. ఏపీ ఆర్థిక రాజధాని అన్న పేరు ఉంది. మరి దీన్ని గంటా అధికారికంగా… ప్రకటించాలని… కోరుతున్నారేమో..?