గంటా శ్రీనివాసరావు పేరు ఆంధ్ర జనాలకు తెలియంది కాదు. వ్యాపారపరంగా, రాజకీయాల్లో చాలా తక్కువ టైమ్ లో ఎదిగిన వ్యక్తి. ఇప్పుడు ఆయన కుటుంబం సినిమారంగంలోకి కూడా పెద్ద ఎత్తున ప్రవేశించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి గంటా కుటుంబానికి సినిమా మూలాలు ఇప్పటికే వున్నాయి. ప్రజారాజ్యం పార్టీ నుంచి గంటాకు మెగా కుటుంబానికి చాలా సన్నిహిత సంబందాలు వున్నాయి. ఇప్పటికి గంటా, మెగాస్టార్ పార్టీలు వేరైనా బంధాలు బలంగానే వున్నాయి. మరోపక్క గంటా అల్లుడు ప్రశాంత్ విశాఖలో సినిమా బయ్యర్ గా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అజ్ఞాతవాసి డిస్ట్రిబ్యూటర్ ఆయనే. రాబోయే అరవింద సమేత కూ ఆయనే డిస్ట్రిబ్యూటర్. గతంలో ఇంకా చాలా పెద్ద సినిమాలు ఆ ఏరియాలో పంపిణీ చేసారు. గంటా కుమారుడు హీరో కావాలని ప్రయత్నించిన సంగతీ తెలిసిందే.
ఇప్పుడు లెటెస్ట్ ఏమిటంటే 2019 ఎన్నికల తరువాత గంటా ఫ్యామిలీ సినిమా నిర్మాణ రంగంలోకి భారీగా దిగబోతోందన్నది. ఇప్పటికే పలువురు టాప్ హీరోలకు, డైరక్టర్లకు గంటా స్టార్ట్ చేయబోయే నిర్మాణ సంస్థ తరపున అడ్వాన్స్ లు అందేసాయి. ఇలా అడ్వాన్స్ లు అందుకున్నవారిలో హీరో రామ్ చరణ్, డైరక్టర్ మారుతి లాంటి వారు వున్నారు. ఈ రెండూ పక్కా. ఇలా అడ్వాన్స్ లు ఇచ్చిన పేర్లు అంటూ చాలా వినిపిస్తున్నాయి కానీ, కచ్చితమైన సమాచారం లేదు.
అంటే గంటా కుటుంబం సినిమా రంగంలోకి కాస్త బలంగానే దిగాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మైత్రీ, యువి, హారిక హాసిని, దిల్ రాజు, అన్నపూర్ణ, సురేష్ మూవీస్ లాంటి బలమైన సంస్థలు వున్నాయి. రాజకీయ, వ్యాపార,విద్యారంగాల్లో బలంగా వున్న గంటా కుటుంబం సినిమా రంగంలోకి వస్తే ఇక్కడా బలమైన పునాది వేసే అవకాశం వుంది.