ఉత్తరాంధ్ర టీడీపీ నేతలతో చంద్రబాబు నిర్వహించాలనుకున్న సమావేశానికి గంటా శ్రీనివాసరావుకు ఆహ్వానం పంపినా ఆయన వెళ్లడం లేదు. శుక్రవారం సమీక్షకు పన్నెండు మంది ఇంచార్జులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. వీరిలో విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా రావాలని అధిష్టానం ఆదేశించింది. 2019 ఎన్నికల తర్వాత పార్టీలో శ్రీనివాసరావు క్రియాశీలకంగా ఉండడం లేదు. టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉన్న ఎమ్మెల్యేల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు. ఓ సారి బీజేపీలో చేరుతారని.. మరోసారి వైఎస్ఆర్సీపీలో చేరుతారని ప్రచారం జరిగింది.
అయితే అన్నీ ప్రచారాలుగానే మిగిలిపోయాయి. అటు ఖండించలేక.. ఇటు అంగీకరించలేక గంటా శ్రీనివాసరావు సైలెంట్‌గా ఉండిపోయారు. మధ్యలో స్టీల్ ప్లాంట్ ఇష్యూ వచ్చినప్పుడు రాజీనామా చేశారు. కానీ అది ఆమోదం పొందలేదు. ఆ తర్వాత ఆ ఉద్యమమూ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేడి కనిపిస్తూండటంతో ఇటీవల గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే యాక్టివ్ అవుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
చంద్రబాబుతో జరిగే సమావేశానికి ఆయన వస్తే పార్టీలో ఉన్నట్లు లేకపోతే ఆయన నియోజకవర్గానికి వేరే ఇంచార్జిని ప్రకటించే ఆలోచన చేస్తారని అంటున్నారు. అయితే గంటా మాత్రం ఇప్పుడు సమావేశానికి రాలేనని త్వరలో చంద్రబాబును కలుస్తానని పార్టీ ఆఫీసుకు సమాచారం ఇచ్చారని అంటున్నారు. గంటా ఏదో ప్లాన్‌లో ఉన్నారని విశాఖ టీడీపీ వర్గాలు ఓ అభిప్రాయానికి వస్తున్నాయి