జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉక్కు ఉద్యమంలోకి ప్రత్యక్షంగా రావాలన్న డిమాండ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పదే పదే పవన్ కల్యాణ్ ప్రస్తావన తీసుకు వస్తున్నారు. మొదట్లో పవన్ వచ్చి గంట సేపు ఉద్యమ శిబిరంలో ఉండాలని చెబుతూ వస్తున్న ఆయన ఇప్పుడు.. నేరుగా ప్రత్యక్షంగా పోరాటంలోకి రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా గంటా టార్గెట్ చేశారన్న అభిప్రాయం వినిపిస్తున్నప్పటికీ… ఉద్యమం దృష్టితోనే గంటా ఈ వ్యాఖ్యలు.. డిమాండ్లు చేస్తున్నట్లుగా అంచనా వేయవచ్చు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి ప్రజల్లో మద్దతు ఉంది. కానీ దాన్ని నడిపించేందుకు అవసరమైన మాస్ లీడర్ మాత్రం లేడు. అందుకే ఇప్పటికీ ఆ ఉద్యమం.. కార్మికుల ఉద్యమంగానే నడుస్తోంది.
పవన్ కల్యాణ్ లాంటి జనాకర్షణ ఉన్న నేత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరకు వ్యతిరేకంగా రోడ్లెక్కితే.. ప్రజలు ఆయన వెంట కదులుతారు. అది మహోద్యమం అవడానికి అవకాశం ఉంటుంది. ప్రణాళిక ప్రకారం.. ఉద్యమానికి పవన్ కల్యాణ్ నాయకత్వం వహిస్తే… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో… కేంద్రం వెనక్కి తగ్గక తప్పదన్న అంచనాలు కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో పండిపోయిన గంటా శ్రీనివాసరావుకు ఈ విషయం తెలుసు కాబట్టే… పవన్ ను రోడ్డెక్కాలని ఆయన కోరుతున్నారు. అయితే.. గంటా శ్రీనివాస్ పిలుపును.. రాజకీయ వ్యూహంగా కూడా కొంత మంది కొట్టి పారేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ నుంచి పవన్ కల్యాణ్‌ను దూరం చేసే లక్ష్యంతోనే.. గంటా శ్రీనివాస్.. పవన్ కల్యాణ్‌ను స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కొంత మంది ఆరోపిస్తున్నారు. ఒక వేళ నిజంగా పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి రావాల్సి వస్తే.. ఖచ్చితంగా బీజేపీతో తెగతెంపులు చేసుకోవాల్సిందే. లేకపోతే.. పొత్తు పొసగదు. బీజేపీ వంద శాతం.. ప్రైవేటీకరణకు మద్దతు ఇస్తోంది. ఆ పార్టీ ఏపీ నేతలు కూడా మెల్లగా స్వరాన్ని మార్చుకుంటున్నారు. ప్లాంట్ అక్కడే ఉంటుందని.. ఎక్కడికీ పోదని డొంక తిరుగుడు వాదనలు వినిపిస్తున్నారు. ఈ పరిణామాలుచూస్తే.. బీజేపీని వదిలి పెట్టిన తర్వాత మాత్రమే పవన్ కల్యాణ్ ఉద్యమంలోకి రావాల్సి ఉంటుంది.
అయితే బీజేపీని వదిలించుకోవడానికి జనసేనకు ఇంత కన్నా మంచి మార్గం ఉండదని మరికొంత మంది విశ్లేషిస్తున్నారు. ఏపీకి ఎలాంటి ప్రయోజనమూ చేకూర్చకుండా.. హమీలు అమలు చేయని బీజేపీపై ప్రజల్లో పీకల్లోతు కోపం ఉందని..బీజేపీతో అంట కాగడం వల్ల అది జనసేనపై వ్యతిరేకతగా మారే ప్రమాదం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే వీలైనంత త్వరాగా…బీజేపీకి గుజ్ బై చెప్పాలని కొంత మంది పవన్ కల్యాణ్‌కు గట్టిగానే సూచిస్తున్నారు.