వైసీపీ హయాంలో విశాఖలో జరిగిన భూఅక్రమాలపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టిందా? విశాఖను కేంద్రంగా చేసుకొని భూకబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలకు త్వరలోనే ఉచ్చు బిగుసుకోనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో విశాఖలో జరిగిన భూఅక్రమాలపై ‘ విశాఖ ఫైల్స్ ‘ పేరుతో వివరాలు వెల్లడిస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు స్పష్టం చేశారు. ఐదేళ్లలో జరిగిన వైసీపీ నేతల భూదందాలను వెలికి తీయనున్నట్లు చెప్పారు. ఈ ప్రకటన ఆయన ఏదో ఆషామాషీగా చేసినట్లుగా కనిపించడం లేదు. ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించడంతోనే విశాఖ ఫైల్స్ విషయాన్ని గంటా శ్రీనివాస రావు ప్రస్తావించినట్లు స్పష్టం అవుతోంది.
ఎన్నికల ఫలితాల విడుదలైన కొద్ది రోజులకే రుషికొండలో జగన్ ప్యాలెస్ వ్యవహారాలను గంటా ఏకపక్షంగా బయటపెట్టడంపై ప్రభుత్వ పెద్దలు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలొచ్చాయి. అయినప్పటికీ మళ్లీ గంటా ‘విశాఖ ఫైల్స్’ విడుదల చేయనున్నామని ప్రకటన చేశారంటే.. వైసీపీ నేతల భూదందాలను వెలికితీసేందుకు సీక్రెట్ గా ఆపరేషన్ కొనసాగుతున్నట్టేనని అంటున్నారు. అదే విషయాన్ని గంటా చెప్పి ఉంటారని వైసీపీ నేతల్లో కూడా ఆందోళన కనిపిస్తోంది.
ఇదే జరిగితే విశాఖను సెంటర్ గా మార్చుకొని భూకబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలకు చిక్కులు తప్పవు. అందుకే కొంతమంది నేతలు కూటమి పార్టీలోకి జంప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. విఫలం అవుతుండటంతో టెన్షన్ పడుతున్నారు. ఏదీ ఏమైనా విశాఖ ఫైల్స్ విషయం మాత్రం వైసీపీలో కలవరం పుట్టిస్తోంది.