భవిష్యత్‌లో జనసేనకు పనిచేస్తానేమో అన్నట్లుగా మాట్లాడిన చిరంజీవిని.. భవిష్యత్ దాకా ఎందుకు వర్తమానంలోనే జనసేనకు మద్దతుగా ఉండేలా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివసరావు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. గాడ్ ఫాదర్ సినిమా సూపర్ సక్సెస్ అయిందని అభినందించడానికంటూ చిరంజీవితో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీ ఏదో వ్యక్తిగతంగా జరిగిపోతే సరిపోయేది కానీ ఫోటోలు తీసి మీడియాకు ఇచ్చి.. మీకు కావాల్సింది ఊహించుకోమని చాన్సిచ్చేశారు. దీంతో వారిద్దరి మధ్య రాజకీయ జరిగాయన్న అంశం తెరపైకి వచ్చింది.
ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించిన గంటా శ్రీనివాసరావు.. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కాంగ్రెస్ నేత అయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నారు.. టీడీపీ హయాంలోనూ మంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. అయితే మొదటి నుంచి రాజకీయాలకు అతీతంగా చిరంజీవితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్‌గా లేకపోయినప్పటికీ పలుమార్లు చిరంజీవితో కనిపించారు.ఇప్పుడు మరోసారి చిరంజీవితో భేటీ అయ్యారు.
టీడీపీ తరఫున 2019 ఎన్నికల్లో గెలిచిన గంటా శ్రీనివాస రావు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య స్టీల్‌ప్లాంట్ ఉద్యమం పాల్గొన్న ఆయన.. తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా కూడా సమర్పించారు. అప్పటి నుంచి శాసన సభకు కూడా వెళ్లడం లేదు. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకుని చాలా కాలం అయింది. తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానన్నారు. తన సోదరుడికి సపోర్ట్ చేసేందుకే సైలెంట్‌గా ఉన్నానని ప్రకటించారు. ఇప్పుడా సైలెంట్‌ని పొలిటికల్ వైలెంట్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.