తెలుగుదేశం పార్టీ ఇక మనకు లేడు అనుకున్న ఎమ్మెల్యేల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు. ఆయన వైసీపీలో చేరికలకు ముహుర్తం చాలా సార్లు ఖరారైంది. ఇతర టీడీపీ ఎమ్మెల్యేల్లా… ఆయన కుమారుడికి కండువా కప్పిస్తారన్న ప్రచారం జరిగింది. సోము వీర్రాజు లాంటి బీజేపీ పెద్దలు గంటా మా పార్టీలోకి వచ్చేస్తున్నారని బహిరంగంగానే చెప్పడం ప్రారంభించారు. వారి ప్రచారానికి తగ్గట్లుగా గంటా శ్రీనివాసరావు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారు. అందుకే.., తెలుగుదేశం పార్టీ కూడా…పార్టీ పదవుల్లో ఎక్కడా గంటా పేరును కనిపించనీయలేదు. దాంతో ఇక గంటా టీడీపీని వీడినట్లేనని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా గంటా టీడీపీకి షాకిచ్చారు. మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గంలోని కార్పొరేషన్ డివిజన్లలో అందర్నీ గెలిపిచాలని పట్టుదలగాఉన్నారు. అందుకే… వారందరితో సమావేశం నిర్వహించారు. పార్టీ పరంగా… విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ సమావేశం ఏర్పాటు చేయించి.. ఆ సమావేశంలో … కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. దీంతో ఇక నుంచి టీడీపీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటానని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది.
తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత గంటాకు ఉన్న వివిధ రకాల ఇబ్బందుల వల్ల ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉండలేకపోయారు. ఆయన స్థలాలు, ఆస్తులు టార్గెట్గా వైసీపీ రాజకీయం నడిచింది. ఓ ఇల్లు కూల్చివేతకు ప్రయత్నించడంతో కోర్టుకెళ్లి ఆపగలిగారు. ఇంకో స్థలం ఇటీవలే స్వాధీనం చేసుకున్నారు. దానిపైనా కోర్టుకు వెళ్లారు. అలాగే.. ఆయనకు సంబంధించిన ప్రత్యూష సంస్థ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిందని ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకులు ప్రయత్నించాయి. అది కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. దీంతో గంటా ఇక తనను ఇబ్బంది పెట్టేందుకు అధికార పార్టీలకు ఏమీ లేదని భావించి టీడీపీలో యాక్టివ్ అవుతున్నారని అంచనా వేస్తున్నారు.