” ఆనాడు ఇంట్లో ఉన్న వ్యక్తి … గంటా శ్రీనివాసరావు. పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది గంటా. అలాంటి నేతలు మనకు వద్దు..”.. ఈ మాటలన్నది నాటి యువరాజ్యం అధ్యక్షుడు.. ప్రస్తుత జనసేనాధిపతి పవన్ కల్యాణ్. పశ్చిమగోదావరి జిల్లా పోరాట యాత్రలో ఉన్న పవన్… ఓ చేరికల కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న వారందరికీ… పీఆర్పీని కాంగ్రెస్ లో కలపడానికి గంటా శ్రీనివాసరావు ఎవరనే సందేహం… అక్కడున్న ఎవరికీ రాలేదు. ఎందుకంటే వాళ్లంత పవన్ కల్యాణ్ నిఖార్సైన అభిమానులు. ఓ సూపర్ డైలాగ్ప చెబితే కొట్టినట్లు..చప్పట్లు ..కొట్టేశారు. మరి ఈ డైలాగ్ చెప్పిన పవన్ కల్యాణ్‌కు అయినా…తను ఏమన్నాడో తర్వాత అయినా అర్థం అవుతుందా..?
పవన్ కల్యాణ్.. తన జనసేన.. పీఆర్పీలా కాదని ..సుదీర్ఘ కాలం నడుపుతానని ఫ్యాన్స్‌ను నమ్మించడానికి తంటాలు పడుతూ ఉంటారు. అయితే ఎప్పుడూ.. పీఆర్పీ ప్రస్తావన తీసుకు రాలేదు. తన అన్న చిరంజీవి గురించి.. పాజిటివ్‌గా చెబుతారు కానీ.. ఎప్పుడూ పార్టీని నడపలేపోయారని చెప్పలేదు. కానీ హఠాత్తుగా… ఈ రోజు పవన్ కల్యాణ్ నోటి వెంట పార్టీ ప్రస్తావన వచ్చేసింది. గంటా శ్రీనివాసరావు తీసుకెళ్లి… కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని కలిపేశారన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ చిరంజీవిని అనలేక.. ఆ ప్లేస్‌లోకి గంటా శ్రీనివాసరావు తీసుకొచ్చారా..? లేక నిజగానే గంటా శ్రీనివాసరావే చిరంజీవిపై ఒత్తిడి తెచ్చింది.. పీఆర్పీ విలీన ప్రక్రియనంతా.. తన చేత్తో నడిపించారా..? అన్నది కొత్తగా ఇక్కడ సందేహాలకు తావిస్తున్న ప్రశ్న.
పీఆర్పీ ఓడిపోయిన తర్వాత పవన్ కల్యాణ్ యువరాజ్యం బాధ్యతలను కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ… కాంగ్రెస్ పార్టీలో… పీఆర్పీ విలీనాన్ని మాత్రం వ్యతిరేకించారన్న ప్రచారం జరిగింది. ఆ నిర్ణయం నచ్చకే.. అన్నకు దూరంగా ఉంటున్నారని కూడా చెప్పుకున్నారు. ఆ క్రమంలో పీఆర్పీలో అంతర్గతంగా ఏం జరిగిందో పెద్దగా బయటకు రాలేదు. కానీ.. పార్టీ అధ్యక్షుడిగా చిరంజీవి.. సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయారన్నది మాత్రం. పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో కలిపేద్దామని.. ఎమ్మెల్యేలు.. చిరంజీవిపై ఒత్తిడి తెస్తున్నట్లు అప్పట్లో విపరీతంగా ప్రచారం జరిగింది. ఓ పత్రికలో ” జెండా పీకేద్దాం” అని చిరంజీవి దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లుగా వచ్చిన కథనం… పెద్ద రగడ సృష్టించింది. చివరికి అదే నిజమైంది. అయితే ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసినంత మాత్రాన పార్టీని .. కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా అన్నది చాలా మందికి ఉండే సందేహం.
పవన్ కల్యాణ్.. పీఆర్పీ విలీనం విషయంలో గంటా ప్రస్తావన తీసుకు రావడం కాకతాళీయంగా జరిగిందా… లేక తన సోదరుని తప్పేమి లేదని చెప్పడానికి… అంతా గంటా మీద వేయాడానికి ప్రణాళిక ప్రకారం ఆ మాటలు అన్నారా అన్నది కాస్త చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే… పార్టీ నడపలేని వ్యక్తిగా చిరంజీవిపై చాలా బ్యాడ్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ మసకబారేలా చేస్తే.. చిరంజీవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావొచ్చు. అందుకే పీఆర్పీ విలీన ప్రక్రియలో.. తప్పు చిరంజీవిదే కాదు.. అప్పట్లో పార్టీలో ఉన్న వారందరిదీ అని చెప్పి… తిలా పాపం తలా పిడికెడు పంచితే పనైపోతుందన్న ఆలోచన కూడా.. పవన్ కల్యాణ్ చేసి ఉండవచ్చన్న అంచనాలున్నాయి. నోరు జారి అన్నారా..? ప్రణాళిక ప్రకారం అన్నారా.. అన్నది ముందు ముందు తేలిపోయే అవకాశం ఉంది..