మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పీకర్ తమ్మినేని సీతారాం పిలవకపోయినా .. ఆయన సొంత ఊరు ఆముదాల వలస వెళ్లారు. ప్రత్యేకంగా సమయం తీసుకుని వెళ్లి కలిశారు. తాను పంపిన రాజీనామా లేఖను పరిశీలించి.. వెంటనే ఆమోదించాలని కోరారు. స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చానని… కూడా గుర్తు చేశారు. అయితే తాను రాజీనామా లేఖను ఇంకా పరిశీలించలేదని అమరావతి వెళ్లిన తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని తమ్మినేని సీతారం.. గంటా శ్రీనివాసరావుకు చెప్పి పంపించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ప్రజా ప్రతినిధుల రాజీనామాలతోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని ఆయన అంటున్నారు.
తనతో పాటు అందరూ రాజీనామాలు చేయాలని… ఇదే రాజీనామాలకు సరైన సమయం అని గంటా కొంత కాలంగా పిలుపునిస్తున్నారు. ఒందరిపై ఒత్తిడి పెరగాలంటే.. తన రాజీనామాను ఆమోదించుకోవడమే మార్గమని ఆయన అంటున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు చేసే ప్రజా ప్రతినిధులపై.. టీడీపీ పోటీ పెట్టదని ఆయన చాలా సార్లు ప్రకటించారు కూడా. ఇప్పుడు తమ్మినేనిని కలిసిన తర్వాత కూడా అదే చెబుతున్నారు. తన నియోజకవర్గం నుంచి తాను మళ్లీ పోటీ చేయబోనని… స్టీల్ ప్లాంట్ జేఏసీ ఎవరు ప్రతిపాదిస్తే వారికే మద్దతిస్తానని ప్రకటించారు. స్పీకర్ తమ్మినేని సీతారం.. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు.
అధికార పార్టీకి ఇబ్బందికరం అయితే.. ఆయన ఆమోదించడానికి అనుమతి రాదు. అందుకే.. ఈ అంశఎంపై… ప్రభుత్వ పెద్దలు ఏం చెబితే.. దాని ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గంటా రాజీనామాను ఆమోదిస్తే.. టీడీపీకి ఓ ఎమ్మెల్యే తగ్గిపోతారు. అయితే.. ఒక వేళ అక్కడ ఉపఎన్నిక జరిగితే స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ పెరుగుతుంది. ఈ కారణంగా రాజీనామాను ఆమోదించడానికి ప్రభుత్వ వర్గాలు సిద్ధంగా లేవన్న ప్రచారం జరుగుతోంది.