వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల ఫంక్షన్ లో జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి చేసిన పరోక్షమైన వ్యాఖ్యలు కలకలం సృష్టించడంతో వైఎస్ఆర్సిపి నాయకులు చిరంజీవి ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించడం తెలిసిందే. అయితే చిరంజీవికి అండగా నిలబడుతూ వైఎస్ఆర్సిపి నాయకుల విమర్శలను తిప్పికొడుతూ గంటా ట్వీట్ చేశారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా బ్రో విడుదల సందర్భం లో మంత్రి అంబటి రాంబాబు ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే. అతి తక్కువ నిడివి కలిగిన పృథ్వి పాత్ర తనని పోలి ఉందంటూ ఆయనే రచ్చకెక్కి, ఈ సినిమా ఫ్లాప్ అని ఆయనే తీర్మానం చేసి, అంతటితో ఆగకుండా ఈ సినిమాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి కంప్లైంట్ చేస్తాను అంటూ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. గతంలో వకీల్ సాబ్ సినిమా సమయంలో పేర్ని నాని, బిమ్లా నాయక్ సమయంలో వెల్లంపల్లి ఇదే తరహాలో ప్రవర్తించిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యం లో, చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో మాట్లాడుతూ, ప్రాజెక్టులు, రోడ్లు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని , పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సరి కాదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
దాంతో మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినప్పుడల్లా చిరంజీవిని మాత్రం పొగడుతూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు సంధించిన వైఎస్ఆర్సిపి నేతలు సడన్ గా ప్లేటు ఫిరాయించి చిరంజీవి కూడా టార్గెట్ చేశారు. కొడాలి నాని వంటి వాళ్లు చిరంజీవి పేరు ప్రస్తావించకుండా పకోడీ గాళ్లు కూడా ప్రభుత్వం ఎలా నడపాలో చెపుతున్నారు అంటూ నోరు పారేసుకోగా, చిరంజీవి అభిమానిని అని చెప్పుకునే పేర్ని నాని సైతం చిరంజీవి ని విమర్శించారు. ఫిలింనగర్ నుండి ఏపీ సచివాలయం ఎంత దూరమో, సచివాలయం నుండి ఫిలింనగర్ కూడా అంతే దూరం అని, మీరు గోకితే మేము కూడా గోకుతాం అంటూ సవాళ్లు విసిరారు తప్పించి చిరంజీవి లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇవ్వలేకపోయారు. ఇక బొత్స సత్యనారాయణ మాత్రం ఎవరికీ అర్థం అయ్యి అవ్వకుండా , చిరంజీవి మాటల ప్రకారం సినిమా ఇండస్ట్రీ పిచ్చుక అవుతుందా, అప్పుడు బ్రహ్మాస్త్రం ఎవరు అవుతారు అంటూ ఎవరికి అర్థం కాకుండా కౌంటర్లు వేశారు. ఈ వ్యవహారం అంతటి పైన స్పందించిన గంట శ్రీనివాస్, తన సోషల్ మీడియాలో ట్వీట్ వేస్తూ-
“విమర్శలకు , వివాదాలకు దూరంగా ఉండే అందరివాడు మెగాస్టార్ గారు. ఆయనకు కూడా ఇబ్బంది కలిగి అలా మాట్లాడారంటే అర్థం చేసుకోండి. రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో..చిరంజీవి గారు చెప్పిన దానిలో తప్పేముంది నిజాలే మాట్లాడారు, ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు అంతే కదా..
మీరు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి,
ప్రాజెక్టుల గురించి, పేదవాడి కడుపు నింపే ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించండి. అలా కాదని పిచ్చుక పై బ్రహ్మాస్త్రం లాగా ఇండస్ట్రీ మీద పడతారేంటి. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుంటారన్నారు. ఆయన చెప్పిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా పట్టుమని పది నిముషాలు తమ శాఖలు గురించి మాట్లాడలేని మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టు ఏదేదో ఆయన గురుంచి మాట్లాడటం సరికాదు. ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమపై కాకుండా ఉద్యోగాలు, పేదలపై దృష్టి సారించాలన్న మెగాస్టార్ చిరంజీవి గారి వ్యాఖ్యలను తెలుగు ప్రజలందరూ సమర్థిస్తున్నారు #WearewithChiru” అని వ్రాసుకొచ్చారు.
మరి గంటా శ్రీనివాస్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సిపి నాయకులు ఏ విధంగా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి. చిరంజీవి ని టార్గెట్ చేయడం ద్వారా అటు వైఎస్ఆర్సిపి పార్టీ ఇటు ఏపీ ప్రభుత్వం ప్రజల్లో మరింత చులకన అవుతుంది అన్న సంగతిని వైఎస్ఆర్సిపి నాయకులు గుర్తిస్తారేమో అన్నది కూడా వేచి చూడాలి