స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను చేసిన రాజీనామాను ఆమోదించాలంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి స్పీకర్‌ను కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడే ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లోనే తమ్మినేని సీతారాంకు రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగతంగా వెళ్లి కలిశారు కూడా. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆ అంశం మరుగున పడిపోయింది. మధ్యలో ఓ సారి రాజీనామా ఆమోదంపై కోర్టుకెళ్లాలని ఆయన అనుకున్నారు. కానీ ఎందుకో వెళ్లలేదు.
స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన తర్వాత స్పీకర్‌కు ఆమోదించకపోవడానికి కారణాలు లేవు. కానీ ఆయన ఆమోదించలేదు. కానీ గంటా కూడా ఎప్పుడూ పెద్దగా పట్టుబట్టలేదు ఎప్పుడో ఓ సారి తన రాజీనామా ఆమోదించాలని కోరుతూ వస్తున్నారు. ఖచ్చితంగా ఆమోదించుకోవాలంటే ధర్నాలు చేయడం లాంటివి చేసి ఉండేవారు. కానీ అలాంటివేమీ చేయలేదు. తాజాగా మోడీ విశాఖ పర్యటనకు వస్తున్న సమయంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రాజీనామా అంశం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.
అయితే ఏపీలోనూ ఓ ఉపఎన్నిక తీసుకురావాలని వైసీపీ అనుకుంటే తక్షణం ఆ రాజీనామాను ఆమోదించవచ్చు. మరోఆరు నెలల్లో ఉపఎన్నిక వస్తుంది. ప్రజా వ్యతిరేకత తమ వైపు లేదని నిరూపించుకోవడానికి వైసీపీకి చాన్స్ లభిస్తుంది. గతంలో బద్వేలు, ఆత్మకూరులాంటి చోట్ల ఉపఎన్నికలు జరిగినా .. అవి సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోవడం వల్ల వచ్చాయి. ప్రతిపక్షం పోటీ పెట్టలేదు. అందుకే ఈ సారి విశాఖలో అదీ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబట్టి వైసీపీకి చాన్సులుంటాయని.. కానీ ఎందుకు రాజీనామాను ఆమోదించడం లేదోనన్న సందేహాలు వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ అంత ఎక్కువగా లేదని జీవీఎంసీ ఎన్నికల్లోనే తేలిపోయింది