మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మూడు, నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి.. బీజేపీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. తన టీడీపీ సహచరులు.. సుజనా చౌదరి, సీఎం రమేష్‌లతో దాదాపుగా రోజూ.. సమావేశమవుతున్నారు. తన రాజకీయ భవిష్యత్‌పై చర్చలు జరుపుతున్నారు. గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరేందుకు దాదాపుగా సిద్ధమయ్యారని.. అయితే.. తన రాజకీయ భవిష్యత్ కు గ్యారంటీ కోసం.. ఆయన బీజేపీ పెద్దల వద్ద.. ప్రతిపాదనలు పెట్టారని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం… గంటా బీజేపీలో చేరితో.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి… లేదా… స్పీకర్ అయిన అనర్హతా వేటు వేస్తారు. ఇప్పటికే వల్లభనేని వంశీ కూడా.. వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన కూడా రాజీనామా చేయాల్సి ఉంది.
గంటా శ్రీనివాసరావు.. ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. విశాఖ భూకబ్జాలంటూ… ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ నియమించిన తర్వాత ఆయన మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో.. ఆయన టీడీపీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. సురక్షిత మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. బీజేపీలో చేరితే.. తన జోలికి వైసీపీ రాదని… గంటా గట్టి నమ్మకంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. రాజకీయ భవిష్యత్ మాత్రం ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనలో ఆయన ఉందని సన్నిహితులు చెబుతున్నారు. దీనికి భరోసా కోసమే… గంటా.. బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లారు.
గంటా వైసీపీ వైపు కూడా చూడవచ్చన్న ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీ కూడా.. జగన్మోహన్ రెడ్డిని కలిసే ముందు… సుజనా చౌదరితో చర్చలు జరిపారు. వంశీకి కూడా.. బీజేపీలో చేరితే రక్షణ ఉండేది .. కానీ ఆయన వైసీపీనే ఎంచుకున్నారు. ప్రస్తుతానికి గంటా బీజేపీతో చర్చలు జరిపినప్పటికీ.. తర్వాత ఆయన.. వైసీపీ వైపు చూసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇప్పటికే.. వైసీపీలోకి రావాలని.. ఆయనకు.. ప్రతిపాదనలకు కూడా వెళ్లినట్లుగా… ప్రచారం జరుగుతోంది. గంటా ఏ నిర్ణయం తీసుకుంటారోననేది … ఒకటి, రెండు వారాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.