ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్ని సార్లు చెప్పినా…. చూపించినా కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుగా ఓటేస్తూండటంతో వైసీపీ హైకమాండ్‌కు టెన్షన్ ప్రారంభమయింది. విప్ ధిక్కరించాల్సిన పని లేదు. ఓటింగ్ కు గైర్హాజర్ అవడమో లేకపోతే.. చెల్లని ఓటుగా వేసినా చాలు మొత్తం సీన్ మారిపోతుంది. అందుకే వైసీపీ హైకమాండ్ టెన్షన్ పడుతోంది. ప్రతీ రోజూ నేతలతో ప్రాక్టీస్ చేయిస్తోంది. కానీ ఎమ్మెల్యేలు డిసైడ్ అయిన వారుంటే వారి మాటలు వారే వినే పరిస్థితి లేదు.
టీడీపీ కి ఎలా ఓట్లు తగ్గించాలన్న దానిపై ఇప్పుడు వైసీపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ప్రస్తుతం స్పీకర్ వద్ద గంటా శ్రీనివాస్ రాజీనామా లేఖ పెండింగ్‌లో ఉంది . చాలా కాలంగా ఆమోదించలేదు. ఇప్పుడు ఆమోదించినట్లుగా నోటిఫికేషన్ ఇస్తే.. ఆయన ఓటు హక్కు కోల్పోతారు. అదే జరిగితే టీడీపీకి ఓ ఓటు తగ్గిపోతుంది. వైసీపీ సభ్యులకు మరింత అడ్వాంటేజ్ వస్తుంది. అయితే ఇది కాస్త రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. గంటా రాజీనామా ఆమోదిస్తే ఉపఎన్నిక వస్తుంది. దాన్ని ఎదుర్కోగలం అనుకుంటే చేస్తారు.. లేకపోతే లేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లో ఉంది. క్యాడర్ లో నిరాశ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో… వారికి ధైర్యం కల్పించడానికి ఓ ఉపఎన్నికలో గెలిస్తే బాగుంటుందని వైసీపీ హైకమాండ్ అనుకుంటే రాజీనామా ఆమోదించవచ్చు.కానీ ఓడితే మాత్రం ఇక సాధరాణ ఎన్నికలపై ఆశలు వదులుకోవాల్సి వస్తుందని భయపడితే మాత్రం ఆగిపోతారు.మొత్తంగా గంటా శ్రీనివాస్ రాజీనామా లేఖ ఇప్పుడు వైసీపీకి ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లయింది.