విశాఖ వాల్తేర్ క్లబ్‌పై విజయసాయిరెడ్డి కన్ను పడటం.. న్యాయవివాదాల్లో ఉన్నట్లుగా చూపించి.. దాన్ని స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలు చేయడం కలకలం రేపుతోంది. ఎంతో మంది పెద్దలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు వాల్తేర్ క్లబ్లో సభ్యులుగా ఉన్నారు. ఇలాంటి వాల్తేర్ క్లబ్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలు చేయడం.. విజయసాయిరెడ్డి.. అధికారుల్ని… ఏజీని కూడా పిలిపించి.. సమీక్ష చేయడంతో ఇక వాల్తేర్ క్లబ్ పై ఆశలు వదిలేసుకోవాల్సిందేనన్న ప్రచారం జరుగుతోంది. ఇది విశాఖ ప్రజల సెంటిమెంట్ వ్యవహారంగా మారే సూచనలు కనిపిస్తూండటంతో.. నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా స్వాగతిచిన గంటా శ్రీనివాసరావు… కాస్త సాఫ్ట్ పదాలతోనే.. వాల్తేరు క్లబ్ జోలికి రావొద్దని.. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి సూచించారు.
వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం.. సానుకూల ఆలోచనా దృక్పథం అవలంభిస్తే మంచిదని గంటా సూచిస్తున్నారు. 1883 నుంచి ఈ క్లబ్ ప్రజల జీవన విధానంలో మమేకమైందని .. విశాఖ బ్రాండ్‌లో వాల్తేరు క్లబ్ భాగమైందని గుర్తు చేశారు. విద్యావేత్తలు, నిపుణులు ఇందులో సభ్యులుగా ఉన్నారని.. ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని.. ప్రభుత్వం దీన్ని యధాతథంగా ఉంచాలన్నారు. గంటా శ్రీనివాసరావు ఘాటుగా.. ట్వీట్ పెట్టకపోయినప్పటికీ.. ప్రజల సెంటిమెంట్ అని చెప్పడం… అలాగే ఉంచాలని… కోరడం… హైలెట్ అవుతోంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అక్కడ ఓ రకమైన పరిస్థితి ఉంది. భూములపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో విజయసాయిరెడ్డి వివాదాస్పద భూముల పేరుతో.. కొన్ని కీలకమైన భూములపై అధికారుల్ని పిలిపించి మరీ వివరాలు సేకరించడం.. డాక్యుమెంట్లు తీసుకోవడం వంటివి చేస్తూండటంతో ప్రజల్లో అలజడికి కారణం అవుతున్నాయి. పైగా మీడియాలో ప్రతీ రోజూ.. భూకబ్జాల వార్తలు అదే పనిగా వస్తున్నాయు. ఆరు వేల ఎకరాలు.. భూసమీకరణ చేస్తామనే ప్రకటన కూడా.. విశాఖలో చర్చనీయాంశం అయింది.