చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై గంటా శ్రీనివాసరావును నిలబెట్టాలన్న టీడీపీ ఆలోచన ఒక్క సారిగా వైరల్ గా మారింది. గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఒక సారి గెలిచిన చోట మరోసారి పోటీ చేయరు. ఈ సారి కూడా ఆయన సీటు మారడం ఖాయం. విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయడంలేదు. సరైన నియోజకవర్గం కోసం చూస్తున్నారు. గతంలో పోటీ చేసిన గెలిచిన భీమిలిపై ఎక్కువ దృష్టి పెట్టారని అంటున్నారు.
అయితే టీడీపీ హైకమాండ్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఆయనకు ఓ కొత్త టాస్క్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ మేరకు.. చీపురుపల్లిలో ఆయనను నిలబెట్టాలని సర్వేలు చేయించారు. సర్వేల్లో మంచి ఫలితాలు రావడంతో ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించుకోవాలని గంటాకు సూచించినట్లుగా తెలుస్తోంది. నిజానికి గంటా శ్రీనివాసరావుకు ఇది ఓ రకంగా పరీక్ష లాంటిదే. పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. పార్టీ కోసం పని చేయలేదు. పైగా చాలా సార్లు పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. దీంతో ఆయనపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి ఉంది.
పార్టీ మెరుగుపడిన తరవాతనే మళ్లీ యాక్టివ్ అయ్యారని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన బొత్స లాంటి వాళ్లతో పోటీ ప డటానికి సిద్ధమైతే.. పాతవన్నీ మర్చిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం చీపురుపల్లిలో యువనేత కిమిడి నాగార్డున పని చేసుకుంటున్నారు. గత ఐదేళ్లుగా ఆయన బాగా కష్టపడినప్పటికీ.. విజయం కష్టమన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో కిమిడి నాగార్జున కూడా.. గంటాతో కలిసి పని చేస్తే.. బొత్సను 2014లోలా ఓడించే అవకాశాలు ఉంటాయి. అది గంటాకు కూడా సవాల్ గానే ఉంటుంది.