తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయిందని తెలుస్తోంది. గతంలోనే ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది కానీ.. అప్పట్లో ఆగిపోయింది. అవంతి శ్రీనివాస్.. గంటాపై తీవ్రమైన విమర్శలు చేసేవారు. విజయసాయిరెడ్డి సైలెంట్‌గా ఉన్నా… అవంతికి ఆయన గాడ్‌ఫాదర్‌లా ఉంటున్నారు. గంటా వైసీపీలోకి వస్తే.. విశాఖ పార్టీని గుప్పిట్లోకి తీసుకుంటారన్న భావనతో.. ఆయన వైసీపీలో చేరకుండా.. విజయసాయిరెడ్డి,అవంతినే అడ్డుకున్నారని చెప్పుకున్నారు. అయితే.. గంటా వారికి మించిన రాజకీయం చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీలో ప్రస్తుతం విజయసాయిరెడ్డిని వెనక్కి నెట్టేసి రెండో స్థానానికి చేరుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా వైసీపీలో చేరేందుకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది.
దీనికి సంబంధించి.. జగన్ తో సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం మాట్లాడేశారని.. జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. మంచి ముహుర్తం చూసుకుని గంటా… ఫ్యాన్ గూటికి చేరడమే మిగిలిందని అంటున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాతే.. ఆయనను ఆపడానికి.. సొంత పార్టీపై ఒత్తిడి తేవడానికి విజయసాయిరెడ్డి సైకిళ్ల స్కామ్ అంటూ… ట్వీట్లు చేశారని… త్వరలో గంటా అరెస్టవుతారని.. అవంతి వ్యాఖ్యానించడం ప్రారంభించారని అంచనా వేస్తున్నారు. కేసులు పెడతామని భయపెట్టి.., పార్టీలో చేర్చుకుంటున్నారన్న భావన ప్రజల్లో వస్తుందని… అందుకే.. జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తారన్న ఉద్దేశంతో.. విజయసాయిరెడ్డి సైకిళ్ల స్కాం అంటూ గంటాపై.. ఆరోపణలు చేశారని అంటున్నారు. అయితే.. విజయసాయిరెడ్డి ప్లాన్ ను.. జగన్ పెద్దగా పట్టించుకోలేదంటున్నారు. విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్‌కు ఇష్టం ఉన్నా లేకపోయినా… గంటాను పార్టీలో చేర్చుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం విజయసాయిరెడ్డి… కరోనాతో ఆస్పత్రి పాలయ్యారు. మరో రెండు వారాల వరకు ఆయన ఎలాంటి రాజకీయం చేయలేరు. దీంతో అవంతి శ్రీనివాస్ ఒంటరి అయ్యారు. ఆయనకు హైకమాండ్ విజయసాయిరెడ్డి మాత్రమే. ఇప్పుడు గంటాను అడ్డుకోవడం ఆయన వల్ల అయ్యే పని కాదు. విజయసాయిరెడ్డి .. అందుబాటులో లేకపోవడం చూసుకుని గంటా .. వైసీపీలో చేరిక వార్తలను.. ఆ పార్టీ నేతలు లీక్ చేసినట్లుగా చెబుతున్నారు.