గంటా శ్రీనివాసరావు తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన పోటీ భీమిలీ నుంచే అని చంద్రబాబు దాదాపుగా ఖరారు చేశారు. చీపురుపల్లి నుంచి ఆయనను బొత్సపై పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. ఈ మేరకు సర్వేలు చేయించారు. అయితే గంటాకు మాత్రం ఇష్టం లే్దు. అక్కడ్నుంచి పోటీ చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని చంద్రబాబు చెప్పినా .. విశాఖ జిల్లా దాటిపోలేనని ఆయన భీష్మించుకు కూర్చున్నారు.
ఓ దశలో సొంతంగా సర్వేలు చేయించుకుని వెళ్లడానికి సిద్ధమయ్యారు. కానీ తర్వాత పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారాయి. బీజేపీకి శ్రీకాకుళం కాకుండా ఎచ్చెర్ల కేటాయించాలనుకోవడంతో.. అక్కడ ఉన్న కళా వెంకట్రావును.. చీపురుపల్లికి పంపాలని అనుకుంటున్నారు. ఈ కారణంగా గంటా శ్రీనివాసరావుకు భీమలీనే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. టిక్కెట్ ఖరారు చేసేందుకు నిర్వహించే ఐవీఆర్ఎస్ పోల్ ను కూడా భీమిలీలో నిర్వహించారు. ఇక అధికారిక ప్రకటనే మిగిలిందని తెలుస్తోంది.
కొంత మంది సీనియర్లకు ఈ సారి టిక్కెట్లు దక్కడం లేదు. ఆ జాబితాలో గంటా లేకపోవడం.. తాను అనుకున్న సీటే్ రావడం గంటా అదృష్టం అనుకోవచ్చు. గతంలో ఓ సారి భీమలీ నుంచి గంటా గెలిచారు. అక్కడైతే ఆయన సులువుగా గెలుస్తారన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విశాఖ ఉత్తరంను ఇప్పటికే బీజేపీకి కేటాయించారు. అక్కడ్నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేసే అవకాశం ఉంది.