మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని వాడుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన తన పదవికి చెల్లని రాజీనామా చేసి… అందరూ అలాగే చేయాలని పిలుపునిచ్చారు. అంతే కాదు.. రాజకీయ పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు. పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరగడం ఖాయం కాబట్టి… దానికి తానే నాయకత్వం వహించాలని ప్రణాళికలు వేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. ఆయన ఇతర నేతలంతా రాజీనామాలు చేయాలని కోరుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి కలసి రావాలని ఆయన పిలుపునిస్తున్నారు.
గంటా శ్రీనివాస్ రాజీనామా లేఖ ఆమోదం పొందడం కష్టమే. తన రాజీనామా లేఖను లెటర్ ప్యాడ్‌పై స్వయంగా రాసి స్పీకర్‌కు పంపించారు. అందులో తాను స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. రాజీనామా చేయాలంటే దానికో ఫార్మాట్ ఉంటుంది. లేఖలో ఎలాంటి కారణాలు చెప్పకూడదు. తాను రాజీనామా చేస్తున్నట్లుగా ఒక్క వాక్యం మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. కానీ గంటా శ్రీనివాసరావు తాను స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నట్లుగా లే్ఖలో రాశారు. అది సాంకేతికంగా చెల్లుబాటు కాదు. అయితే స్పీకర్ విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకోవచ్చని కొంత మంది నిపుణులు చెబుతున్నారు. స్పీకర్ కార్యాలయానికి రాజీనామా లేఖ అందిన తర్వాత స్పీకర్ ఆయనను ప్రత్యక్షంగా కలవమని కబురు పెట్టి.. రాజీనామాకు కట్టుబడి ఉంటారో లేదో అడగవచ్చు. లేదా.. అక్కడి వరకూ కూడా అవసరం లేదనుకుంటే ఫార్మాట్లో లేని కారణంగా తిరస్కరించవచ్చు.
గంటా మనస్ఫూర్తిగా రాజీనామా చేయలేదని.. రాజకీయ కోణంలోనే రాజీనామా చేశారని.. లేఖను పరిశీలించిన ఎవరికైనా అర్థమైపోతుంది. గత రెండేళ్లుగా ఆయన సైలెంట్ గా ఉన్నారు. టీడీపీలో ఐదేళ్లు మంత్రిగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీ ఓడిపోయి.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. అధికార పార్టీల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక సైలెంటయ్యారు. అటు బీజేపీలోకి వెళ్లలేకపోయారు. ఇటు వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధమైనా.. ఆయనను వ్యతిరేకించే బలమైన వర్గం.. అడ్డుకుంటోంది. ఈ క్రమంలో ఆయన తన రాజకీయ ఉనికి ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కలిసి వచ్చేలా ఉంది.