పార్టీ మారే అంశంపై తానెప్పుడూ మాట్లాడలేదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆయన పార్టీ మారుతారని చాలా కాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది కానీ ఆయన మాత్రం అటు ఖండించడం కానీ.. ఇటు నిజమేననే సంకేతాలు ఇవ్వడం కానీ ఎప్పుడూ చేయలేదు. తొలి సారిగా ఆయన తనపై జరుగుతున్న ప్రచారాలపై నేరుగా స్పందించారు. తాను పార్టీ మార్పుపై ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు.
రాధా – రంగా రీయూనియన్ పేరుతో విశాఖ లో కాపు నాడు బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ నెల26న నిర్వహిస్తున్న ఈ సభను గంటా శ్రీనివాసరావు ప్రోత్సాహంతో ఏర్పాటు చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సభ పోస్టర్ను గంటా శ్రీనివాస్ రిలీజ్ చేశారు. ప్రతీ కార్యక్రమం అనివార్యంగా రాజకీయాలతో ముడిపడే ఉంటుందని.. ఈ కాపునాడు సభ వెనుక ఉన్న రాజకీయ అజెండా ను ఆర్గనైజర్స్ సరైన సమయంలో వివరిస్తారని చెప్పుకొచ్చారు. అయితే కాపునాడు సభ నేను లీడ్ తీసుకుంటున్నానన్నది సరికాదన్నారు. రాజకీయాలకు అతీతంగా కాపు నాడు సభ జరుగుతుందన్నారు. ఆంధ్రా రాజకీయాల్లో రంగా పాత్ర చారిత్రాత్మకం.. ఆయన వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న కాపునాడు సభ విజయవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కాపు నాడు సభకు అన్ని పార్టీల నేతలు హాజరవుతారా.. లేక కొన్ని పార్టీల నేతలే హాజరవుతారా అన్న అంశాన్ని బట్టి గంటా పార్టీ మారుతారా లేదా అన్నది డిసైడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రంగా వర్ధంతిని సహజంగానే విజయవాడలో ఆయన కుమారుడు వంగవీటి రాధా నిర్వహిస్తారు. అదే రోజున విజయవాడలో కాపునాడు సభ పెట్టడం ఆసక్తిరకంగా మారింది.