భీమిలి నియోజక వర్గం నుంచి ఎవరు పోటీ చేసినా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైకాపా నేత అవంతి శ్రీనివాస్. ముఖ్యమంత్రిగానీ, ఆయన కుమారుడు నారా లోకేష్ గానీ తనతో పోటీ పడాలంటూ సవాల్ చేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి గంటా శ్రీనివాస్ పై కూడా తీవ్ర విమర్శలు అవంతి చేశారు. ప్రజలను బెదిరించి తనవైపునకు తిప్పుకోవడం గంటా శ్రీనివాస్ కి అలవాటైన పని అంటూ ఆరోపించారు. సింహాచలం దేవస్థానంలో అధికారులను కూడా గంటా బెదిరిస్తున్నారనీ, దేవుడి భూములతో ఆయన వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. భీమిలి టిక్కెట్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా ఆయన బెదిరిస్తున్నారనీ, వాస్తవానికి గంటాను భీమిలి తీసుకొచ్చిందే తానని అవంతి విమర్శించారు.
అవంతి వరుస ఇలా ఉంటే… భీమిలి టిక్కెట్ ఈసారి తనకే కావాలంటూ గంటా పట్టుబడుతున్నట్టు సమాచారం. వరుసగా నియోజక వర్గాలను మార్చడం గంటాకి అలవాటు. కానీ, ఈసారి భీమిలి నుంచే ఆయన పోటీకి దిగుతా అంటున్నారట! అయితే, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖ జిల్లా నుంచి మంత్రి నారా లోకేష్ ను బరిలోకి దించాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది. మంత్రి లోకేష్ కూడా భీమిలి నుంచి పోటీకి ఆసక్తిగా ఉన్నారంటూ కథనాలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు గంటా పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. గ్రేటర్ విశాఖ పరిధిలోని ఈస్ట్, సౌత్, వెస్ట్, గాజువాక అభ్యర్థుల ప్రకటన మాత్రమే మిగులుంది. ఎంపిక కసరత్తును ముఖ్యమంత్రి పూర్తి చేశారు. భీమిలి విషయంలో మాత్రం ఏదీ తేల్చకపోవడం గమనార్హం.
ఒకవేళ నారా లోకేష్ ను భీమిలి నుంచి బరిలోకి దింపితే… గంటాను విశాఖ ఉత్తర నియోజక వర్గం ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట. లేదంటే విశాఖ ఎంపీ టిక్కెట్ ను గంటాకి కేటాయించే ఉద్దేశంలో ఉన్నారట. విశాఖ ఎంపీ టిక్కెట్ ను కాపులకు కేటాయించాలని ఆయన భావిస్తున్నారట. కానీ, తన చిరకాల మిత్రుడు అవంతి శ్రీనివాస్ వైకాపా నుంచి భీమిలిలో పోటీ చేస్తుండటంతో, ఆయనపై భారీ మెజారిటీతో గెలవాలన్నది గంటా పట్టుదలగా తెలుస్తోంది. తనపై విమర్శలు చూస్తూ రెచ్చిపోతున్న అవంతిని ఓడించడమే లక్ష్యమని గంటా అంటున్నారట! గంటా పట్టుదలలో ఈ కోణాన్ని పార్టీ అధిష్టానం ఎలా చూస్తుందనేది వేచి చూడాలి.