విజయసాయిరెడ్డి మొదటి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే.. జగన్ అన్ని కేసుల్లో ఏ -వన్ అయితే… విజయసాయిరెడ్డి ఏ-టు. నిజానికి అసలు జగన్ అక్రమాస్తుల కేసుల్లో జగన్‌కు లబ్ది కలిగి ఉండవచ్చు కానీ.. అసలు మాస్టర్ ప్లానర్ మాత్రం విజయసాయిరెడ్డి అని.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైఎస్ కుటుంబ ఆడిటర్‌గా ఉంటూ.. జగన్మోహన్ రెడ్డి దగ్గర నమ్మకం తెచ్చుకుని ఆయన వ్యాపారాలు.. పెట్టుబడులు మొత్తాన్ని దగ్గరుండి చూసుకున్నారని… అందరికీ తెలుసు. అయితే అనూహ్యంగా ఇప్పుడు.. విజయసాయిరెడ్డి కోర్టుల్లో వినిపిస్తున్న వాదనలు… చార్జిషీట్లలో ఆయన పేర్లు మాయం కావడం వంటివి… వైసీపీ శిబిరంలో కలకలం రేపుతున్నాయి.
ఈడీ దాఖలు చేసిన తాజా చార్జిషీట్లో.. ఏ-2గా విజయసాయిరెడ్డి పేరు మిస్ అయింది. మొల్లగా విజయసాయిరెడ్డి.. అన్ని చార్జిషీట్ల నుంచి ఇదే కారణంతో తప్పుకుంటారని.. కోర్టుల్లో అవే వాదనలు వినిపిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఆయన.. తనకు క్విడ్ ప్రో కోల్లో ఒక్క రూపాయి లాభం రాలేదనికోర్టుల్లో వాదించడం ప్రారంభించారు. సీబీఐ కూడా.. మొత్తం ఆయన చేయించారని చెబుతోంది కానీ.. విజయసాయిెడ్డికి లాభం కలిగిందని చెప్పడం లేదు. అంటే మొత్తం జగనే చేశారన్న అభిప్రాయం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీలోని ఓ వర్గం అనుమానిస్తోంది. మరో వైపు జగన్ కూడా.. అంతా విజయసాయిరెడ్డే చేశారన్న వాదన వినిపిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం.. జగతి పబ్లికేషన్స్ కేసులో జగన్మోహన్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లలో విచారణలో అసలు ఆ కేసులో తనకు సంబంధమే లేదని.. మొత్తం విజయసాయిరెడ్డినే చేశారని జగన్ తరపు న్యాయవాదులు వాదించారు. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులపై దాఖలైన కేసులో… మోసపోయామని ఫిర్యాదు చేసిన ముగ్గురూ.. తన పేరును ఎక్కడా చెప్పలేదని.. తనకు సంబంధం లేదని.. తనను కేసు నుంచి డిశ్చార్జ్ చేయాలని జగన్ కోరుతున్నారు. విజయసాయిరెడ్డిని మాత్రమే నిందితునిగా చూడాలంటున్నారు.
వైసీపీలో ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఓ వైపు విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టడం.. మొత్తం వ్యవహారాలు సజ్జల చూస్తూండటంతో అంతర్గతంగా ఏదో జరుగుతోందని.. విజయసాయిరెడ్డికి గడ్డు కాలం రాబోతోందని చెబుతున్నారు.