రుణాలివ్వలేదని బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన దేశవ్యాప్తంగా దూమారం రేపడం.. ఇండస్ట్రీ వర్గాల్లో సైతం చర్చనీయాంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందిస్తోంది. రెండు రోజుల కిందట… ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనకు ఫోన్ చేసిన .. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరోసారి అలా జరగకుండా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కానీ.. ఈ ఘటన అలాంటి వివరణతో సరి పెట్టేంత చిన్నది కాదని.. చాలా తీవ్రమైనదని కేంద్రానికి కూడా వెంటనే తెలిసి వచ్చింది. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు.. ఏపీలో తాము ఎదుర్కొంటున్న వేధింపుల వ్యవహారాలపై కేంద్రానికి ఫిర్యాదులు చేయడంతో… మొత్తం ఘటనపై విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు.. ఏపీ సర్కార్‌కు ఆదేశాలివ్వడంతో.. బాధ్యులెవరో తేల్చాలని.. ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉయ్యూరులో ఏపీ మున్సిపల్‌శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విచారణ ప్రారంభించారు.
ఎవరి ఆదేశాలతో చెత్త వేశారన్నదానిపై సమాచారం సేకరిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, మెప్మా, చెత్తను సేకరించే ఏజెన్సీని ప్రశ్నించారు. చెత్త వేసిన తర్వాత ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ పేరుతో బోర్డులు కూడా పెట్టారు. అది యాదృచ్ఛికంగా… ఆవేశంతో చేసిన పని కూడా కాదు. దాదాపుగా ఇరవైకి పైగా బ్యాంకుల ముందు ఒకే సారి చెత్త వేశారు. అంటే ముందస్తుగా ప్రణాళిక ప్రకారం.. ఇలా చేశారని స్పష్టమవుతుంది. అయితే బ్యాంకులు లోన్లు ఇవ్వనందుకు లబ్దిదారులే ఆ పని చేశారనే వాదనను .. అధికారులు వినిపించడం ప్రారంభించారు. అసలు లోన్లు ఇస్తామన్నది బ్యాంకులు కాదు.. ప్రభుత్వం. ఈ మేరకు పత్రాలు జారీ చేసి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ మీట నొక్కి.. అందరి అకౌంట్లలోకి డబ్బులు జమ చేశామని చెప్పారు. కానీ.. బ్యాంకులు మాత్రం.. లోన్లు ఇవ్వలేమని తేల్చేస్తున్నాయి.
అంటే.. లబ్దిదారులు ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారు కానీ బ్యాంకుల్ని కాదు. అలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కాబట్టే.. అధికారులు.. బ్యాంక్ అధికారుల్ని బెదిరించడానికి ఈ పని చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీ అధికారులు… ఎలాంటి విచారణలు జరిపినా… అధికారుల మీద ఈగ వాలకుండా నివేదిక ఇవ్వడం ఖాయం. అసలు ఆ పని చేయమని.. చెప్పింది.. ఓ ప్రభుత్వ సలహాదారు అని.. ఆయనను మెప్పించేందుకు కొంత మంది అధికారులు గీత దాటారని.. ప్రభుత్వ వర్గాల్లోనే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం నివేదిక రూపంలో బయటకు రావాలంటే.. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలే విచారణ చేయాలని.. టీడీపీ నేతలంటున్నారు.