ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రేసింగ్లకు ముందు ఫ్లాగ్ ఆఫ్ చేసే సీన్ బాగా ఇష్టంలా ఉంది. ఆయన వందల కొద్దీ వాహనాలకు అలా.. జెండా ఊపి ప్రారంభించడాన్ని తెగ ఇష్టపడుతున్నట్లుగా ఉంది. విజయవాడ బెంజ్ సర్కిల్లో ఓ సారి 108 వాహనాలు.. ఇంకో సారి రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు అలా జెండా ఊపిన ఆయన ఈ సారి… చెత్త తరలింపు వాహనాలకు జెండా ఊపాలని నిర్ణయించారు. మొత్తంగా ఎనిమిది వేల వాహనాలు కొనుగోలు చేయాలని.. వార్డుకు రెండు చొప్పున కేటాయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జూలై ఎనిమిదో తేదీ లోపు కొనుగోళ్లు పూర్తి చేసి… వాహనాలు రెడీచేస్తే.. ఆ రోజు బెంజ్ సర్కిల్లో వాహనాల పరేడ్ పెట్టి… వాటికి జెండా ఊపి సీఎం జగన్ ప్రారంభిస్తారు. జూలై ఎనిమిదో తేదీనే ఎందుకు అంటే…ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని 108 వాహనాలు కొనుగోలు చేశారు. మిగతా వాటికి రంగులేశారు. అలా మొత్తంగా అన్నీ కొత్తవే ప్రారంభిస్తున్నట్లుగా అన్నిటికీ బెంజ్ సర్కిల్లో జెండా ఊపారు. ఆ తర్వాత రేషన్ డోర్ డెలివరీ వాహనాల వంతు. దాదాపుగా తొమ్మిది వేలవాహనాలను కొనుగోలు చేశారు. ఒక్కొక్క వాహనానికి ప్రభుత్వానికి నెలకు ఇరవై వేల కంటే ఎక్కువే ఖర్చు అవుతోంది. ఆ వాహనాలను గుజరాత్లో రెడీ చేయించి తీసుకు వచ్చారు. ఇప్పుడు చెత్త కోసం ఎనిమిది వేల వాహనాల్ని కొనాలని డిసైడయ్యారు.
నిజానికి గత ప్రభుత్వం స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రతను నెలకొల్పేందుకు చెత్త సేకరణ కోసం గత సార్వత్రిక ఎన్నికల ముందు మండలానికి 15 ఆటోలు మంజూరయ్యాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులను ఎంపిక చేసి ఆటోలను అందిచాల్సి ఉంది. కాని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడంతో అవి నిరుయోగంగా ఉంటున్నాయి. తుప్పుపట్టిపోయిన దృశ్యాలు కొన్ని మీడియా సంస్థలు వెలుగులోకి తెస్తున్నాయి. ఇప్పుడు ఆ వాహనాలకు మళ్లీ రంగులేస్తారా లేకపోతే.. కొత్తవి కొనుగోలు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.