ఏ నాయకుడైనా పార్టీ మారిన వెంటనే ఏం చేస్తారు… గతంలో కొనసాగిన పార్టీ మీద విమర్శలు చేస్తారు, పార్టీ అధినాయకుడిపై తీవ్ర ఆరోపణలు చేస్తారు, తనని ప్రాధాన్యత ఇవ్వలేదని అంటారు. కానీ, గరికపాటి మోహన్ రావు భాజపాలో చేరుతున్న సందర్భంగా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందనే ఆవేదన ఆయనలో ఎక్కువగా కనిపించింది. తెలంగాణలో టీడీపీ దయనీత ఆయన మాటల్లో మరోసారి బయటపడింది.
తెలుగుదేశం పార్టీ నుంచి బయటకి వచ్చేస్తున్నందుకు చాలా బాధగా ఉందంటూ కంటతడిపెట్టుకున్నారు గరికపాటి. తెలంగాణలో పార్టీని ఉంచాలా రద్దు చెయ్యాలా అనే పరిస్థితి వచ్చిందనీ, గత ఎన్నికల్లో కేవలం 13 సీట్లు పోటీ చేయాల్సిన పరిస్థితికి పడిపోవడం బాధాకరమన్నారు. బలమున్నా కూడా పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. మనసు చంపుకుని భాజపాలో చేరుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాను చంద్రబాబు నాయుడు తీరుని ఎప్పుడూ తప్పుబట్టడం లేదనీ, పార్టీని సమూలంగా నాశనం చేయాలనుకునేవారు కొంతమంది ఉన్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకు ఏ పదవీ రాలేదనీ, పార్టీ కోసం చాలా పోరాటాలు చేశాననీ, కష్టకాలంలో పార్టీ వెంట ఉన్నానని గరికపాటి చెప్పుకొచ్చారు. ఆయతోపాటు భాజపాలో చేరిన పాల్వాయి రజనీ కుమారి, బండ్రు శోభారాణీ కూడా ఇలాంటి బాధనే వ్యక్తం చేశారు.
ఇప్పుడు టీటీడీపీలో నాయకులంటే ఇద్దరే కనిపిస్తున్న పరిస్థితి. నిజానికి, తెలంగాణపై పార్టీ నాయకత్వం మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే, పార్టీని ఇంతగా ప్రేమించే నాయకులున్నప్పుడు… ఇలాంటి సమయంలోనైనా వారికి ప్రాధాన్యత ఇచ్చి, కీలక బాధ్యతలు ఇచ్చి ప్రోత్సహించి ఉంటే పార్టీ ఉనికి నిలబడేది. కానీ, ఏపీలో ఓటమి తరువాత తెలంగాణలో పార్టీ శాఖ మీద పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టలేని పరిస్థితి ఉంది. తెలంగాణలో పార్టీ తరఫున కనీసం నెలకో ప్రెస్ మీట్ అయినా, అడపాదడపా సభలైనా నిర్వహించి ఉంటే ఉనికి నిలబడేది. ఇప్పటికీ పార్టీ మీద అభిమానంతో ఉన్న కార్యకర్తలకు బాసటగా ఉండేది. కానీ, ఆ ప్రయత్నమేదీ అధినాయకత్వం నుంచి కనిపించినప్పుడు ఏమౌతుంది… ఎంతటి అభిమానులైనా ఇదిగో ఇలానే కంటతడిపెట్టి బయటకి వెళ్లక తప్పదు.