తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఏపీ రాజకీయాలు, వ్యవహారాలు, అమరావతి వ్యవహారాల్లో సైతం చక్రం తిప్పుతున్న తెలంగాణకు చెందిన కొద్దిమంది నాయకుల్లో రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహనరావు ఒకరు. తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన ఏకంగా కేంద్ర మంత్రి పదవి మీద కన్నేసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం తెదేపా కోటాలో కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరి పదవీకాలం త్వరలోనే పూర్తికాబోతున్న నేపథ్యంలో.. ఏర్పడబోయే ఖాళీలో తాను కేంద్రమంత్రి కావడానికి వీలుగా గరికపాటి పావులు కదుపుతున్నట్లు సమాచారం.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులైన తెలంగాణ నాయకుల్లో గరికపాటి మోహనరావు ఒకరు. ఆయన తెరమీద కీలకంగా కనిపించేది తక్కువే అయినా.. తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో చాలా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంటారు.
పైగా సుజనాచౌదరిని కేంద్రమంత్రి పదవిలో కొనసాగేలా చేయడం అనేది తెలుగుదేశం పార్టీకే భారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాంకులకు రుణాల సొమ్ము ఎగవేతలకు సంబంధించి ఆయన మీద కొన్ని కోర్టు కేసులు విచారణ దశలో ఉండడంతో.. కేంద్రమంత్రి హోదాలో ఉండి ఇలాంటి కేసుల్లో కోర్టుకు వెళ్లే పరిస్థితి వస్తే ప్రభుత్వం పరువు పోతుందని మోడీ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఏపీ రాష్ట్రం పరిధిలో కూడా కొత్తగా రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. సుజనా చౌదరికి మళ్లీ అవకాశం ఇవ్వడంపై సందేహాలే రేగుతున్నాయి. అదే సమయంలో ఆయన బదులుగా తెదేపాకు దక్కే కేంద్ర కేబినెట్ కోటాలో తెలంగాణకు చెందిన గరికపాటిని నియమించాలని చంద్రబాబు ఆలోచనగా ప్రచారం జరుగుతోంది.
గరికపాటిని నియమిస్తే.. తెలంగాణలో పార్టీని అంతో ఇంతో బలోపేతం చేసుకోవడం కూడా కుదురుతుందని.. పార్టీ తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడినేతలకు పదవులు ఉంటే.. పార్టీని కాపాడుకోవచ్చునని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా గరికపాటి మోహన్‌రావుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కూడా చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. సాధారణంగా పార్టీ కార్యక్రమాలు చాలా వరకు ఆయన నేతృత్వంలో జరుగుతుంటాయి. చంద్రబాబు పాదయాత్రకు ఆయనే సమన్వయకర్త. ప్రతిసారీ మహానాడు ఏర్పాట్లు కూడా ఆయనే చూస్తుంటారు. ఇంత కీలకమైన నేత గనుకనే ఆయనకు కేంద్రమంత్రి పదవిని కట్టబెట్టే యోచనతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.