అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా పై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అవధాన ప్రక్రియ, ప్రవచనాల్లో ప్రసిద్ధులైన ఆయనకు ఇటీవల కేంద్రప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ఛానెల్ గరికపాటిని ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా సినిమాల ప్రస్తావన వచ్చింది. సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా కొన్ని సినిమాలు ఉండటం లేదని అన్నారు గరికపాటి. ఇక్కడే ‘పుష్ప’ సినిమా గురించి చెబుతూ.. స్మగ్లర్ని హీరోగా ఎలా చూపిస్తారంటూ ప్రశ్నించారు. ”స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకూ సమంజసం. స్మగ్లింగ్ చేసే వ్యక్తి ‘తగ్గేదే లే’ అంటాడా? ఇప్పుడు అదొక సూక్తి అయిపోయింది. ఒక కుర్రాడు ఎదుటివ్యక్తిని కొట్టి.. ‘తగ్గేదే లే’ అంటున్నాడు. ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. ‘తగ్గేదే లే’ అనేది హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటి వారు వాడాలి. అంతేకానీ స్మగ్లర్లు కాదు’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యనించారు గరికపాటి. అంతేకాదు.. ఇది ఎంతవరకూ న్యాయమో హీరో, దర్శకుడు దీనికి సమాధానం చెప్పాలన్నారు.
కాగా గరికపాటి చేసిన కామెంట్స్ నెట్లో వైరల్ గా మారాయి. బేసిగ్గా ఇలాంటి వ్యాఖ్యలు తెరపైకి వచ్చేటప్పుడు సినిమాని సినిమాగా చూడాలని, దాన్ని ఒక కళారూపంగా చూడాలే తప్పితే సినిమానే మొత్తం సమాజాన్ని మార్చేస్తుందని వ్యాఖ్యానించడం తగదని కామెంట్స్ వినిపిస్తుంటాయి. గరికపాటి వ్యాఖ్యలపై కూడా ఇదే రకంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ”గురువు గారు సినిమాని సినిమాగానే చూడండి” అంటూ హితువుపలుకుతున్నారు కొందరు. మరికొందరైతే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ చెప్పిన డైలాగ్ కారణంగా సమాజం చెడిపోయే పరిస్థితి లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా గరికపాటి పద్మశ్రీ అందుకుంటున్న సమయంలో చేసిన ఈ కామెంట్స్ చర్చకు దారితీశాయి.