తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని… ఒకప్పటి.. టీడీపీ సీనియర్ నేత.. ప్రస్తుత టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆపరేషన్ ప్రారంభించారు. దాన్ని ఇప్పుడు.. టీడీపీ తరపునే రాజ్యసభకు ఎంపికయి.. బీజేపీలో విలీనం అయిన గరికపాటి మోహన్ రావు.. పూర్తి చేస్తున్నారు. తెలంగాణలో మిగిలిపోయిన టీడీపీ నేతంలదర్నీ ఆయన బీజేపీ గూటికి చేర్చుతున్నారు. వివిధ జిల్లాల తెలుగుదేశం కార్యవర్గాలు పసుపు రంగు నుంచి కాషాయ రంగుకు మారబోతున్నాయి. ఆదివారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైద్రాబాద్ వస్తున్నారు. టీడీపీ నాయకుల మూకుమ్మడి చేరికలతో పాటు.. బహిరంగ సభను కూడా బీజేపీ ఏర్పాటు చేస్తోంది.
తెలంగాణలోని ప్రతి జిల్లా నుంచి తెలుగుదేశం కార్యకర్తలు ఈ సభ ద్వారా బీజేపీలోకి రాబోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎక్కువ చేరికలున్నాయి. నల్లగొండ నుంచి తెలుగు మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభరాణి, పాల్వాయి రజనీ, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాసరావు, అంజయ్య యాదవ్ లాంటి నేతలు చేరనున్నారు. వరంగల్ జిల్లా నుంచి ఈగ మల్లేశం, బొట్ల శ్రీనివాస్, అశోక్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎర్ర శేఖర్, జయశ్రీలు , రంగారెడ్డి నుంచి సామ రంగారెడ్డి, మొవ్వ సత్యనారాయణలు, ఖమ్మం జిల్లా నుంచి కోనేరు చిన్ని, మెదక్ జిల్లా నుంచి శ్రీకాంత్ గౌడ్ , మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డిలు బీజేపీలో చేరబోతున్నారు. మహాబూబ్ నగర్ కు చెందిన సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి, సీత దయాకర్ రెడ్డిలు బీజేపీలో చేరాలని భావిస్తున్నా.. డీకే అరుణ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దాంతో చేరికలు ఆదివారం ఉండకపోవచ్చంటున్నారు.
మూకుమ్మడి చేరికలకు రాజ్యసభ ఎంపీ గరికపాటి అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. జిల్లాల నాయకులతో సమన్వయం చేసుకోవటం దగ్గర నుంచి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జేపీ నడ్డా సభకు ఖర్చును కూడా గరికపాటే భరిస్తున్నారు. నాలుగు రోజులుగా ఆయన ఎగ్జిబిషన్ గ్రౌంట్స్ లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జేపీ నడ్డా సభను విజయవంతం చేసి బీజేపీ నాయకత్వం దృష్టిలో పడాలని గరికపాటి భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీని ఫినిష్ చేసి తన బలం నిరూపించుకోవాలని ఆయన అనుకుంటున్నారు.