ఓ సినిమా బడ్జెట్ పెరిగిపోవడానికి కారణం ఎవరు? అని అడిగితే కచ్చితంగా దర్శకుడి పేరే చెప్పాలి. దర్శకుడికి విజన్ లేకపోతే, కచ్చితంగా బడ్జెట్ పెరుగుతూనే ఉంటుంది. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి? ఏ సినిమాకి ఎంత వస్తుంది? అనే లెక్కలు తప్పని సరిగా అవసరం. రాజశేఖర్ – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో సినిమాకి రూ.25 కోట్ల పెట్టబడి అయ్యిందంటే.. ఆ బాధ్యత ఎవరిది?? ప్రవీణ్ మాత్రం ఈ తప్పు తనది కాదంటున్నాడు. ‘లైన్ ప్రొడ్యూసర్‌కి అవగాహన లేకపోవడం వల్లే.. బడ్జెట్ చేయిదాటిపోయిందం’టున్నాడు. ఇదంతా తప్పుని పక్కవాళ్లపై నెట్టేయడమే కదా?? ప్రవీణ్ సత్తారు ఇంటర్వ్యూ, కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతున్న తీరు చూస్తే నవ్వొస్తుంది.
సినిమా బాగుంటే రూ.50 కోట్లయినా వస్తాయి, లేదంటే రూ.5 కోట్లు కూడా రావు – అనేది ప్రవీణ్ స్టేట్మెంట్. దానికి అర్జున్ రెడ్డిని ఉదాహరణగా చూపించారు. నిజమే. సినిమా బాగుంటే చూస్తారు, లేదంటే లేదు. అర్జున్ రెడ్డి 4 కోట్లలో తీశారనుకొందాం, దానికి రూ.40 కోట్లు వచ్చాయనుకొందాం. అదే అర్జున్ రెడ్డి పై రూ.50 కోట్లు పెడితే…. వందా రావు కదా? ఆ మేరకు రూ.10 కోట్లు నష్టమే కదా?? అంటే ప్రతీ సినిమాకీ ఓ స్థాయి ఉంటుంది. అంతకు మించి వసూలు చేయదు. అలాంటప్పుడు అంతకు మించి ఖర్చు చేయడం కూడా అనవసరమే. ఈ పాయింట్ ఎందుకొచ్చిందటే.. గరుగ వేగ రూ.8 కోట్లలో తీద్దామనుకొన్నార్ట. అది రూ.25 కోట్లకు తేలిందట. ఈ విషయాన్నీ రాజశేఖర్, ప్రవీణ్‌లే చెప్పారు. ఇదే గరుగ వేగ రూ.10 కోట్లలో పూర్తి చేసుంటే, ఇప్పటికి నిర్మాతలు హాయిగా ఊపిరి పీల్చుకొనేవారేమో. కానీ ఆ ఛాన్స్ లేదిప్పుడు.
ఈ సినిమాని ‘బేబీ’, ‘డైహార్ట్’ స్ఫూర్తితో తీశానని ముందే చెప్పేశాడు దర్శకుడు. ఒక విధంగా ఇదీ తెలివి తేటల్ని ప్రదర్శించే విద్యే. ఒక వేళ కథ, కథనాలు ఆ సినిమాలతో పోలి ఉంటే తప్పు నాది కాదు.. అని చెప్పుకోవడానికే. బేబీలా అనిపిస్తే అది స్ఫూర్తి అనుకోండి.. కాపీ కానే కాదు, అంటూ ముందే సినీ ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసి పంపుతున్నాడు. మరి రేపు తెరపై ‘బేబీ’ కనిపిస్తుందో, ‘డైహార్ట్’ దర్శమిస్తుందో.. లేదంటే సరికొత్తగా ‘గరుగడవేగ’ ఆహ్వానిస్తుందో..!