బిల్ గేట్స్ తన సంపదలో చాలా మొత్తాన్ని సేవలకు వినియోగిస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా పలు దేశాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏపీలో కూడా ఆయన పలు రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, విద్య, డిజిటల్ పాలన, వ్యవసాయం, ఏఐ టెక్నాలజీతో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం వంటి రంగాల్లో ఏపీ ప్రభుత్వానికి సహకారం అందించనున్నారు. ఐదు కీలక రంగాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని తీసుకునేందుకు ఢిల్లీలో బుధవారం బిల్ గేట్స్, చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలను చేసుకోనున్నారు.
ఏపీ మెడ్‌టెక్ జోన్‌తో కలసి టెలీ మెడిసిన్ అందించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకరిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ సహకారంతో న విద్యను అందించే సాంకేతికను బిల్ గేట్స్ ఫౌండేషన్ అందిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో విద్యను నేర్చుకునే విధానాలు, బోధనా అంశాలను ఉచితంగా సమకూరుస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరడం వంటి విషయాల్లో టెక్నాలజీ కూడా అందించే అవకాశం ఉంది.
వ్యవసాయంలో డిజిటల్ విధానాలు, కృత్రిమ మేధ సహకారాన్ని గేట్స్ ఫౌండేషన్ అందించనుంది. సాంకేతిక నైపుణ్యాలపై రైతులు అవగాహన పెంచుకుని వ్యవసాయంలో ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు. స్పేస్ అప్లికేషన్స్ శాటిలైట్ సిస్టమ్స్‌ను ప్రారంభిస్తామని బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఇప్పటికే ప్రకటించింది. ఏఐ టెక్నాలజీని వినియోగించేలా ప్రభుత్వ ఉద్యోగులకు బిల్ గేట్స్ ఫౌండేషన్ అవగాహన కల్పిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో శిక్షణ కూడా ఇస్తుంది.
బిల్ గేట్స్ తో చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి. గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలను విస్తృతంగా ఉపయోగించుకుంటే.. ఏపీలో యువతకు, రైతులు కాలంతో పాటు మారే టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశాలు ఉంటాయి.