బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్లయ్యింది. 2004లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ విడుదలైంది. అప్పటి నుంచీ… బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మధ్యలో ‘బసంతి’ కాస్త ‘ఓకే’ అనిపించింది. అంతే తప్ప, కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. ‘మను’ విమర్శకులకు నచ్చింది కానీ, సామాన్య ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఆ తరవాత గౌతమ్ ఎవ్వరికీ కనిపించలేదు. తను సినిమాలకు దూరమైపోయాడని అనుకొన్నారు. అయితే ఇప్పుడు ‘బ్రహ్మానందం’ అంటూ ఓ కొత్త సినిమా ప్రకటించాడు. బ్రహ్మానందం, గౌతమ్ ఇద్దరూ తాతా మనవళ్లుగా నటించడం విశేషం. ఈ సినిమా ప్రమోషన్ ని కూడా వెరైటీగా మొదలెట్టారు. చిత్రీకరణ కూడా స్టార్ట్ అయిపోయింది. డిసెంబరులో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.
ఓరకంగా గౌతమ్‌కు ఇదే చివరి ఛాన్స్. నిరూపించుకొంటే, హిట్ కొట్టాలనుకొంటే.. ‘బ్రహ్మానందం’తోనే జరిగిపోవాలి. ఆ తరవాత మరో ఛాన్స్ రమ్మన్నా రాదు. బ్రహ్మీకి ఉన్న పరిచయాలు, ఆర్థిక స్థోమత గౌతమ్‌ని ఇప్పటి వరకూ గట్టెక్కించలేకపోయాయి. తనయుడ్ని హీరోగా పెట్టి, వరుసగా పది సినిమాలు తీయగల కెపాసిటీ బ్రహ్మానందంకు ఉంది. కానీ.. ఆ దిశగా బ్రహ్మానందం ఆలోచించకపోవడం, తనయుడి కెరీర్‌ని ఓ గాడిన పెట్టకపోవడం పెద్ద మైనస్. బయటి నిర్మాతలు గౌతమ్ అంటూ ఒకడున్నాడని గుర్తించి, తనపై పెట్టుబడి పెట్టాలి. అంత రిస్క్ చేసే ధైర్యం ఎవరికి ఉంది? అందుకే గౌతమ్ ఏళ్ల తరబడి అలా ఖాళీగా ఉండిపోవాల్సివచ్చింది. ‘బ్రహ్మానందం’తో తన జాతకం మొత్తం తేలిపోతుంది. ఓరకంగా ఇది తనకు లాస్ట్ ఛాన్స్ అని గౌతమ్ కీ అర్థమయ్యే ఉంటుంది.