హైదరాబాద్: కాల్‌మనీ వ్యవహారాన్ని బయటపెట్టిన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తన సెలవును రద్దు చేసుకున్నారు. కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ, కాల్‌మనీ కేసు తీవ్రత నేపథ్యంలో సెలవు రద్దు చేయమని డీజీపీని తానే అడిగినట్లు చెప్పారు. తన ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకున్నానని, ఈ కేసు దర్యాప్తు యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాల్‌మనీ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. నిన్నరాత్రి పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ ఆయిన చంద్రబాబు, కల్తీ మద్యం, కాల్‌మనీ వ్యవహారాలలో ప్రభుత్వం పరువు పోతోందని, పోలీసుల వైఫల్యం కూడా ఉందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. గౌతమ్ సవాంగ్ సెలవు గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారని, సీఎం సూచనల మేరకే డీజీపీ ఇవాళ గౌతమ్‌ను పిలిచి సెలవు రద్దు చేసుకోవాలని కోరారు. అయితే ప్రతి సంవత్సరం ఇదే సమయంలో తాను ఆస్ట్రేలియా వెళతానని, గత నెలలోనే సెలవుకోసం దరఖాస్తు చేసుకున్నానని, అది మంజూరు కూడా అయిందని గుర్తు చేస్తూ గౌతమ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఇవాళ విజయవాడలో జరిగే క్యాబినెట్ సమావేశంలో కాల్‌మనీ వ్యవహారం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. కాల్ మనీ, కల్తీ మద్యం వ్యవహారాలపై రేపటినుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశమున్నందున వారిని ఎలా ఎదుర్కోవాలనేదానిపై క్యాబినెట్లో చర్చించనున్నారు.