ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీని హైకోర్టు రద్దు చేయడం సంచలనంగా మారింది. నిజానికి 2018లో ఇచ్చిన గ్రూప్ 1 పరీక్ష ప్రక్రియ.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పూర్తి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే వేసీపీ వచ్చిందో అప్పుడు గ్రూప్ వన్ మూల్యంకనంలో మార్పులు చేసేశారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలియదు కానీ.. ఎన్నో ఆరోపణలు వచ్చినా… రకరకాల వాల్యూయేషన్ లు చేసి.. కావాల్సిన వారిని ఉద్యోగాల్లోకి ఎంపిక చేశారు. ఆ అక్రమాల కథ రికార్డుల్లో ఉంది.
2022 జూలైలో ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ విడుదల చేసిన ఫలితాల్లో ఎన్నో విచిత్రాలు బ యటపడ్డాయి. గ్రూప్ వన్ పరీక్షలు గత ప్రభుత్వం పూర్తి చేసింది. వాల్యూయేషన్ చేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం వెంటనే.. ఆ ప్రక్రియను నిలుపుదల చేసింది. మాన్యువల్ పద్దతిలో దిద్దవద్దని డిజిటల్ విధానంలో దిద్దాలని నిర్ణయించింది. ఆ మేరకు దిద్ది ఫలితాలు విడుదల చేశారు. అయితే చాలా మంది ప్రతిభావంతులకు ర్యాంకులు రాలేదు. ఇలాంటి వారిలో సంజనా సింహ ఒకరు. తర్వాత ఆమె సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 40లోపు ర్యాంక్ తెచ్చుకుని ఐఏఎస్ అయ్యారు. ఇక్కడే అసలు కుట్ర బయటపడింది.
తర్వాత మరోసారి మూల్యంకనం చేసి.. సంజనా సిన్హా ఇంటర్యూకు క్వాలిఫై అయ్యారని.. ఆమెకు మూడో ర్యాంక్ వచ్చిందని ప్రకటించారు. అంత వరకూ బాగానే ఉన్నారు. డిజిటల్ మూల్యంకనం చేసి అక్రమాలకు పాల్పడ్డారన్న విషయం మాత్రం సాక్ష్యంతో స్పష్టమయింది. తర్వాత కోర్టుల్లో రకరకాల వాదనలు వినిపించి.. తాము అనుకున్న వారికే ఉద్యోగాలిచ్చారు. గ్రూప్ వన్ అధికారులుగా ఉన్న వారిలో ఎక్కువ మంది ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉన్నారు. ఇదెవరు చేశారు ? ఎందుకు చేశారు ? అనేది.. ప్రభుత్వం మారగానే తేలిపోతుంది. ఆ జవాబు పత్రాలు మిస్సయ్యే అవకాశమే ఉండదు. ఈ మొత్తం వ్యవహారంలో డీజీపీగా చేసి.. ఎపీపీఎస్సీ చైర్మన్ అయిన గౌతం సవాంగ్ పాత్రే కీలకంగా కనిపిస్తోంది. ఆయనే బాధ్యుడయ్యే అవకాశం ఉంది.