నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా కొబ్బరికాయ్ కొట్టుకొన్నప్పటి నుంచీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈసినిమాకి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం ఎప్పటికప్పుడు బయటకు వస్తూనేఉంది. తాజాగా గౌతమి గురించిన మరో ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఇది. గౌతమి పుత్ర శాతకర్ణి క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్రిష్ మదిలో రెండు క్లైమాక్స్‌లు ఉన్నాయని, రెండిటినీ తెరకెక్కించి చివరికి ఒకదాన్ని ఫైనల్ చేస్తారని చెప్పుకొంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. క్రిష్ ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉండాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడట. గౌతమి పుత్ర శాతకర్ణి జీవితంలో అత్యంత మధురమైన, చిరస్మరణీయమైన విజయంతో… ఈ సినిమాకి ఎండ్ కార్డ్ వేస్తారట. గౌతమిపుత్ర మరణంమే ఈ సినిమాకి క్లైమాక్స్‌గా ఉంటుందనుకొన్నా.. ఆ ప్రతిపాదన నుంచి క్రిష్ విరమించుకొన్నాడట. శాతకర్ణి విజయంతో ఈ సినిమా ముగుస్తుందని, ఆ తరవాత.. భారత స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన కొన్ని షాట్స్‌ని చూపించి.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు భారత పతాక రెపరెపలాడినట్టు చూపించిన.. అక్కడ ఎండ్ కార్డ్ వేస్తారని తెలుస్తోంది. పతాక సన్నివేశాల్లో దాదాపు 15 నిమిషాల పాటు వార్ ఎపిసోడ్స్ ఉంటాయట. క్లైమాక్స్‌కి ముందు బాలయ్య పలికే డైలాగులు ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ కానున్నవని సమాచారం. సో.. గౌతమి పుత్రకు రెండు క్లైమాక్సులు లేవు. ఉన్నది ఒక్కటే. అదీ గౌతమి పుత్ర విజయపతాకంతో.. పతాక సన్నివేశాలు తీర్చిదిద్దుతారు. మరి అవి ఎలా ఉంటాయో, వాటిలో బాలయ్య ఏ స్థాయిలో విజృంభించాడో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.