తెలుగు జాతి ఖ్యాతి ని నలుదిశగా వ్యాప్తి చేసిన చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణి. తెలుగు చరిత్రలో ఆ మహనీయునిది ఓ సువర్ణ అధ్యాయం. ఉగాది పర్వదినం జరుపుకొంటున్నామంటే… అది తెలుగువాళ్ల పండగ అయ్యిందంటే అది శాతకర్ణి చలవే. శాంతి కోసం యుద్ధం చేసిన చరిత్ర పురుషుడిగా శాతకర్ణికి చరిత్ర జేజేలు పలుకుతోంది. అలాంటి చక్రవర్తి జీవిత గాథని క్రిష్.. గౌతమి పుత్ర శాతకర్ణిగా వెండి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇది మన సినిమా.. తెలుగువాళ్లంతా గర్వంగా చెప్పుకోవాల్సిన సినిమా. అందుకే… తెలుగు ప్రభుత్వాలు రెండూ ఈ ప్రయత్నానికి వెన్నుదన్నుగా నిలవాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఈ సినిమాపై వినోదపు పన్ను మినహాయించాలని అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కీలక నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. వీటిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పన్ను మినహాయించడం వల్ల టికెట్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. రేట్లుతగ్గేది అంతంత మాత్రమే అయినా.. ఓ సినిమాకి పన్ను మినహాయింపు లభించడం ఓ అరుదైన గౌరవం. గౌతమి పుత్ర ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆడియో పండగకి విశిష్ట అతిథిగా చంద్రబాబు నాయుడు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ త్వరలోనే ఓ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అంతకంటే ముందే పన్ను రాయితీపై ఓ అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది.