సినిమాలు.. రాజకీయాలు… ఈ రెండూ ఇప్పుడు ఏపీలో కలిసిపోయాయి! ఎందుకంటే, హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర విడుదలకు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి బాధ్యతలు పెరుగుతున్నాయని చెప్పుకోవాలి! ఎందుకంటే, తెలంగాణలో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఆడియో ఫంక్షన్ తిరుపతిలో పెట్టారు. ఈ కార్యక్రమాలకు తెలుగుదేశం నేతలు బాగానే శ్రమించారని టాక్. ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చూసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
దాదాపు రూ. 55 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కించాడు. బాలయ్య 100వ చిత్రం కాబట్టి, భారీ హైప్ ఉంది కాబట్టి.. వ్యాపారం బాగా జరుగుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో రూపొందింది కాబట్టి.. దీనికి ఆంధ్రప్రదేశ్ సర్కారు పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో కూడా ఆయనే స్వయంగా మాట్లాడి… పన్ను రాయితీకి ఒప్పించారని కూడా ప్రచారం సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రితో బాలయ్యతోపాటు చంద్రబాబు కూడా మాట్లాడారని చెప్పుకుంటున్నారు.
మొత్తానికి గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం తెలుగుదేశం సొంత సినిమా మారిపోయిందని చెప్పుకోవాలి. ఈ సినిమా విడుదల బాధ్యతలు కూడా తెలుగుదేశం భుజాన వేసుకుంటుందేమో..? నందమూరి ఫ్యామిలీ (ఒక్కరు మినహా!) సినిమాలు విడుదల అయిన ప్రతీ సందర్భంలోనూ తెలుగుదేశం అభిమానులు కూడా సందడి చేస్తుంటారు. సినిమా మొదటి ఆటకు వెళ్లి హడావుడి చేస్తారు. పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ చేసేందుకు ప్రయత్నిస్తారు అని అంటుంటారు. ప్రస్తుతం బాలయ్య కూడా తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ముఖ్యమంత్రికి స్వయానా వియ్యంకుడు. తెలుగుదేశం పార్టీలో సినీగ్లామర్ ఉన్న ఏకైక హీరో బాలయ్య…సో, ఈ సినిమాను భారీ హిట్ అయ్యేంత వరకూ కృషి చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంటుంది కదా!