జనవరి 12న గౌతమి పుత్ర శాతకర్ణి విడుదలకు అన్ని ఏర్పాట్లూ జరిగిపోతున్నాయి. జనవరి 5న సెన్సార్ పూర్తికాబోతోంది. ఆ తరవాత ప్రిమియర్ల హడావుడి మొదలైపోతుంది. ఓవర్సీస్లో 11న ప్రీమియర్లు పడబోతున్నాయి. అంతకంటే ముందు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి స్పెషల్ షో వేయాలని ఎదురుచూస్తోంది చిత్రబృందం. ఇద్దరు సీమ్ లకూ ఓకేసారి షో వేయాలని భావిస్తున్నా… అది కుదిరే పనిలా కనిపించడం లేదు. అందుకే సీఎమ్‌లు ఇద్దరికీ వేర్వేరుగా వాళ్లకు వెసులు బాటు ఉన్న సమయాల్లో గౌతమి పుత్రని ప్రదర్శించాలని డిసైడ్ అయ్యారు.
చంద్రబాబుకి మాత్రం అమరావతిలో షో వేయబోతున్నారని తెలిసింది. అమరావతిలో తనకు సినిమా చూపించమని చంద్రబాబు నాయుడే స్వయంగా చిత్రబృందాన్ని కోరడంతో క్రిష్ అండ్ టీమ్ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. అయితే టైమ్, డేట్ అన్నది చంద్రబాబునే డిసైడ్ చేసి చెప్పాల్సివుంది. బహుశా 10వ తారీఖున చంద్రబాబు ఈ సినిమా చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతకంటే ముందు కేసీఆర్‌కి చూపిస్తారా, లేదంటే బాబు చూశాక చూస్తారా అన్నది తెలియాల్సివుంది. తెలంగాణలో ఫ్యాన్స్ షోలు వేయాలా, వద్దా అనే విషయంపై కూడా చిత్రబృందం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.